కార్యాలయాల నిర్మాణాలకు రూ. రెండు వేల కోట్లు
- 76 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆవిర్భవిస్తున్న కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతోనే సరిపోదని, అవి సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు బుధవారం ఇక్కడ చెప్పారు. ఏడాదిలోగా జిల్లా కార్యాలయాలతో పాటు మండల స్థాయి కార్యాలయాల నిర్మాణం కూడా పూర్తి కావాలని చెప్పారు. ఇందుకోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని, వచ్చే బడ్జెట్లో కార్యాలయాల నిర్మాణం కోసం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని సిఎం ప్రకటించారు. పోలీసు కార్యాలయాలను పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా, ఇతర కార్యాలయాలను ఆర్అండ్బి ద్వారా నిర్మిస్తామని వెల్లడించారు. దసరా నాడే జిల్లా కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాలు కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు.
కొత్త పరిపాలనా విభాగాల్లో పనిచేయడానికి అవసరమైన సిబ్బంది కేటాయింపు తొందరగా పూర్తి కావాలని చెప్పారు. మరోవైపు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నాయకత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ 7వ తేదీన నివేదిక ఇస్తుందని, అప్పుడు ఏ జిల్లాలో ఏ మండలాలు, ఏ డివిజన్లు ఉంటాయనే విషయంలో స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత డివిజన్లు, మండలాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. కాగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఈ నెల 7న మద్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో ఇప్పుడు చేసిన నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది.
మరోవైపు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడితే, నకిలీ విత్తన తయారీదారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్టులు నమోదు చేసి ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నకిలీ విత్తనాల అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు తయారు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు ఏర్పాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపి అనురాగ్ శర్మలను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నకిలీ విత్తనాల సమస్య వెలుగు చూసిన అంశంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ నకిలీ విత్తనాల అంశంపై తక్షణమే విచారణ జరిపించి ముగ్గురు కలెక్టర్లతో నివేదిక తెప్పించి, సంబంధిత నకిలీవిత్తన తయారీదారులపై పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం పేకాట, గుడుంబా, గుట్కాను తరిమికొట్టడంలో విజయం సాధించిందని ఆ తరహాలోనే రాష్ట్రం నుంచి నకిలి విత్తన తయారీదారులు పారిపోయేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు మార్కెట్ లో విక్రయించకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారుల మీద వెంటనే విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. నకిలీ విత్తన తయారీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాలనూ చట్టపరంగా పరిశీలించాలని ఆదేశించారు.
ప్రజలకు నష్టం చేకూర్చే అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితిల్లోనూ రాజీపడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జిల్లాలు పెరగనున్న నేపథ్యంలో కొత్తగా వచ్చే కలెక్టర్లు, ఎస్పీలు నకిలీవిత్తన తయారీదారులవంటి సంఘవ్యతిరేక శక్తులపై పూర్తిస్థాయిలో నిఘాపెట్టే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తజిల్లాల ఏర్పాటు తర్వాత జరిగే కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈ అంశం గురించి పూర్తి స్థాయిలో సమీక్షించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సిటీ పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అదనపు కార్యదర్శి శాంతికుమారి, సిఎంఓ ఉన్నతాధికారులు స్మితసబర్వాల్, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


