కాళ్ల వాపు వ్యాధి సోకిన గిరిజనులకు మెరుగైన వైద్యం: రావెల
- 109 Views
- wadminw
- September 14, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): కాళ్ల వాపు వ్యాధి సోకిన గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించి సత్వరం స్వస్తత చేకూర్చాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వైద్యులను ఆదేశించారు. బుధవారం రాత్రి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాళ్లవాపు, కిడ్ని సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న వి.ఆర్.పురంకు చెందిన 32 మంది గిరిజనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న ఆరోగ్య సేవలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేడు వర్షాకాలంలో ఏజెన్సీ మండలాల్లో మలేరియా జ్వరాల ఉనికి సోకుతోందని, ఈ యేడు సుమారు 4 వేల మలేరియా పాజిటీవ్ కేసులు గుర్తించడం జరిగిందన్నారు. ఏజెన్సీ మండలాల్లో యాంటీ మలేరియా స్ర్పేయింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అయితే ప్రజలు తమ ఇళ్ళలో ఒక గదిలో మాత్రమే స్ర్పేయింగ్‌ను అంగీకరిస్తున్నందున దోమల వ్యాప్తి అదుపులో రావడం లేదన్నారు. 2012లో గిరిజన కుటుంబాలకు దోమల మందు పూసిన దోమ తెరలు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
వి.ఆర్.పురం పరిసర గ్రామాల్లో ఆహారం లేక, నీటి వనరుల కాలుష్యం వల్ల కాళ్లవాపు వ్యాధి సోకుతోందని భావిస్తున్నామని, ఆశ వర్కర్లు అన్ని హేబిటేషన్లలో అవసరమైన మందుల కిట్లతో సేవలందించడం జరుగుతుందన్నారు. కాకినాడ ఆసుపత్రిలో చేరిన 32 మంది గిరిజనులకు నిపుణులైన నెఫ్రాలజిస్ట్‌లతో ప్రత్యేక వైద్య సేవలు అందించడం జరుగుతోందని, అందరూ త్వరితగతిన కోలుకుంటున్నారని మంత్రి తెలిపారు.
గిరిజన ఆరోగ్య పరిరక్షణకు, ఏజెన్సీలో వైద్య సౌకర్యాల అభివృద్ధికి ట్రైబల్ సబ్ ప్లాన్క్రింద జిల్లా కలక్టర్ ఐదు కోట్లు కేటాయింపు కోరారని , నిధులు కల్పించేందుకు పరిశీలిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, అధిక మొత్తాలు జీతాలుగా చెల్లించి, ఏజెన్సీలో వైద్యులను నియమించేందుకు కూడా ప్రభుత్వం సిధ్ధంగా ఉందని మంత్రి కిషోర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ పవన్ కుమార్ పాల్గొన్నారు.


