కావేరీ అంశంలో కర్ణాటకకు ఎప్పుడూ అన్యాయమే: సీఎం
కావేరీ జలాల అంశంలో తమ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు కష్టంగా ఉన్నప్పటికీ న్యాయస్థానం ఆదేశానుసారం ఆరు రోజుల పాటు నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇక్కడ కన్నడ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయొద్దని కోరారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్చేందుకు మీడియా సహకరించాలని కోరారు. బెంగళూరు కర్ణాటక రాజధాని మాత్రమే కాదని, అంతర్జాతీయ నగరమని పేర్కొన్నారు. కావేరీ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిచేందుకు అపాయింట్మెంట్ కోరానని, ఆయన సమయం ఇస్తే బుధవారం కలిసి పరిస్థితిని వివరించనున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఏ సమస్యకైనా హింస అనే పరిష్కారం కాదని, ప్రజలందరూ శాంతి, సంయమనంతో ఉండాలని కోరారు.


