కావేరీ వివాదంపై స్పందించిన వెంకయ్య
కావేరీ నదీ జలాల వివాదంపై కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పందించారు. తమిళనాడు, కర్ణాటక మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా ఉందన్నారు. ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చేయడం మంచిదికాదని సూచించారు. ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని, సామరస్యపూర్వక చర్చలు అవసరమని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు, విధ్వంసం ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ‘‘ఈ వివాదంలో సామాన్య ప్రజలకు భాగస్వామ్యం లేదు, భాష ఆధారంగా దాడుల వల్ల నష్టపోయేది సామాన్యులు, పేదవాళ్లే. శాంతిని పునరుద్దరించడం కోసం ప్రజలు సహకరించాలి.
రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి’’ అని వెంకయ్య కోరారు. పొరుగు రాష్ట్రాల వారి ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని రెండు రాష్ట్రాల సీఎంలు చెప్పారని వెంకయ్య తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దాడి దృశ్యాలను పదే పదే చూపించడం వల్ల ప్రజల్లో భావోద్వేగాలు పెరిగే అవకాశముందన్నారు. కావేరీ జలాల వివాదం సోమవారం కర్ణాటక, తమిళనాడుల్లో భారీ విధ్వంసానికి దారితీసిన విషయం తెలిసిందే. హింస పేట్రేగిన బెంగళూరు లోని 16 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు, కావేరీ జల వివాదంపై బెంగళూరులో విధ్వంసం కొనసాగుతోంది.
సోమవారంతో పోలిస్తే హింసాత్మక ఘటనలు తగ్గినా అక్కడక్కడా దహనం, ధ్వంసం ఘటనలు కొనసాగాయి. మంగళవారం జరిగిన ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో, ఈ వివాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఇక, నగరంలోని 16 పోలీసు స్టేషన్ల పరిధిలో వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ అమలు చేశారు. బుధవారం రాత్రి వరకూ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, విధ్వంసకారులపై కఠిన చర్యలు తప్పవని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది. ఆర్ఎంసీ యార్డు లే అవుట్లో సగం కాలిన తమిళనాడు రిజిసే్ట్రషన్ బస్సుకు ఆందోళనకారులు మరోసారి నిప్పు పెట్టారు. గుంపులు గుంపులుగా చేరి నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయువును ప్రయోగించారు. రామనగరలో డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తెకు చెందిన ఫామ్ హౌస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
మైసూరులోని జగన్మోహన్ ప్యాల్స్లో తమిళ సినిమా చిత్రీకరణను అడ్డుకున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల కావేరీ గొడవల నేపథ్యంలో 335 మందిని అరెస్టు చేసినట్లు హోం మంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు. సుప్రీం కోర్టు తీర్పునకు నిరసనగా శుక్రవారం కర్ణాటక బంద్కు కన్నడ చలువలి పార్టీ పిలుపునిచ్చింది. కావేరీ జల వివాదాల్లో అమాయకులే బలయ్యారు. సినిమా చూడడానికి వెళ్లిన వ్యక్తి సోమవారం పోలీసు తూటాలకు బలవగా, బార్లో పని ముగించుకుని ఇంటికి వెళుతూ లాఠీచార్జి నుంచి తప్పించుకునే క్రమంలో మూడంతస్థుల భవనంపై నుంచి దూకి మంగళవారం మరొకరు బలయ్యారు.


