కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
ముంబయి, అక్టోబబర్ 4: ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. 0.25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. కొత్త గవర్నర్ ఊర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆర్బీఐ కమిటీ కొత్త ద్రవ్యపరపతి విధానాన్ని మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ఇప్పటివరకు ఆర్బీఐ గవర్నర్ మాత్రమే వడ్డీ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకునేవారు. కానీ తొలిసారి ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి కమిటీ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొంది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే అప్పుపై వడ్డీ రేట్లు తగ్గడంతో వినియోగదారులకు బ్యాంకులు ఊరట ఇచ్చే అవకాశం ఉంది. గృహ, వాహన లోన్లపై వడ్డీని తగ్గించే ఛాన్స్ ఉంది.
వడ్డీ రేట్లను తగ్గించాలంటూ చాలా కాలం నుంచి కంపెనీలు, వ్యాపార వేత్తలు కోరుతున్నారు. రెపో రేటే ప్రస్తుతం 6.25శాతంగా ఉంది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లలోకోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన డెబ్యూ పాలసీసమీక్షలో లో కీలక రెపో రేటులో కోత పెట్టారు. రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 25 బేసిస్ పాయింట్లను తగ్గించారు. ప్రస్తుతం ఉన్న 6.50 శాతంనుంచి 6.25 గా నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు తన మొట్టమొదటి పాలసీ రివ్యూలో మ్యాజిక్ చేశారు.
మంగళవారం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం సమీక్షతో వడ్డీ రేట్లు ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి. ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను నిర్ణయం చేసింది. ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్ల కోతకు ఆమోదం తెలిపారు. కాగా ఆర్ బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్‌కు కూడా ఇది మొదటి పరపతి విధాన సమీక్ష కానుండటం విశేషం. ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాతో పాటు కమిటీలో ఆర్బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరుగురు వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉన్నసంగతి తెలిసిందే. మరోవైపు, మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు రెపో రేట్ల తగ్గింపును అందిపుచ్చుకున్నాయి.
ఆర్బీఐ ప్రకటన కోసం వేచి చూసిన దలాల్ స్ట్రీట్ ఆరంభంనుంచీ అప్రతమత్త ధోరణిలో కొనసాగింది. ఆర్బీఐ ప్రకటన తర్వాత ఒకదశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 91పాయింట్ల లాభంతో 28,334 వద్ద,నిప్టీ 31పాయింట్ల లాభంతో 8, 769వద్ద ముగిశాయి. నిఫ్టీ కీలకమద్దతు8750 స్థాయికి పైన స్థిరంగా ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు ముఖ్యంగా ఐటీ, మెటల్స్, ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ ధోరణితో లాభాలను ఆర్జించాయి. మిడ్ క్యాప్ షేర్లు రికార్డుస్థాయి లాభాలను గడించాయి.
ఓఎన్జీసీ, గెయిల్ టాప్ గెయినర్‌గా నిలువగా టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, టాటా పవర్, హెచ్‌సీఎల్ టెక్ లాభపడగా, జీ ఎంటర్టైన్మెంట్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, అంబుజా, యాక్సిస్, హెచ్‌యూఎల్, హిందాల్కో క్షీణించాయి. ద్రవ్య పరపతి సమీక్షలో కీలకమైన వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 0.25 శాతంమేర తగ్గించడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి0.03 పైసల లాభంతో 66.55 వద్ద ఉంది.
ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి పది గ్రా. రూ. 51 లాభంతో రూ.30,630 వద్ద ఉంది. ఇదిలావుండగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మానిటరీ పాలసీ రివ్యూ కమిటీ తన తొలి సమీక్షలో పండుగ కానుక అందించింది. వడ్డీరోట్ల కోత ఉండక పోవచ్చని, యథాతథంగా ఉంటుందనే ఎనలిస్టులు విభిన్న అంచనాల మధ్య ఆర్ బీఐ రెపో రేట్లలో కోత పెట్టి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు ప్రకటన మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో జోష్ పెంచింది. తొలిసారి ఏర్పాటైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగివచ్చి ఆరేళ్ల కనిష్టానికి చేరింది.
ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) 4 శాతంగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) 20,75 శాతం యథాతథంగా ఉంచింది. 2015 సం.రంనుంచి దాదాపు 175 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. దీంతో వాహన, గృహ రుణాలు తగ్గుముఖం పట్టునున్నాయనే ఆశలుమార్కెట్ వర్గాల్లో చిగురించాయి. ఆర్బీఐ గవర్నర్ హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడిన ఉర్జిత్ పటేల్ (52)పలు కీలక అంశాలను ప్రస్తావించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కస్టమర్లకు లబ్ధిని చేకూర్చడంతో పాటు మరింత తక్కువ రేట్లకు నూతన రుణాల లభ్యతను పెంచే లక్ష్యంతో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించినట్టు చెప్పారు. బ్యాంకులకు గుదిబండగా మారిన బ్యాడ్ లోన్ల అంశంపై దృష్టి పెట్టామన్నారు.
ఇది మానిటరీ పాలసీ ఎకగ్రీవ నిర్ణయమని ఉర్జిత్ పటేల్ వెల్లడించారు. ద్రవ్య వైఖరి లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. రోడ్డు రైల్వేలు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, వ్యాపారంలో సౌలభ్యం, పప్పుల సరఫరాలో వృద్ది, పోటీ ర్యాంకింగ్‌లో వృద్ది ఉండనుందని ఉర్జిత్ పటేల్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న సంక్షోభ పరిణామాల నుంచి సులువుగా, వేగంగా బయటపడేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణంతో పాటు సంతృప్తికరంగా ఉన్న రుతుపవనాలు, పంట దిగుబడి పెరగనుందన్న అంచనాలు తమ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెంటనే రుణ తగ్గింపు చర్యలు చేపట్టి వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించాలని ఉర్జిత్ కోరారు. అలాగే వచ్చే ఏడాది అమలులోకి రానున్న జీఎస్టీ (వస్తు సేవల పన్ను) దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచనుందని, మరిన్ని విదేశీ పెట్టుబడులు దేశానికి తరలి రానున్నాయని పటేల్ పేర్కొన్నారు.


