కుబేర వీధిలో లక్ష్మీ నివాస్!?
- 77 Views
- wadminw
- January 9, 2017
- అంతర్జాతీయం
ప్రవాస భారతీయ ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ లండన్‌లో నివసిస్తున్న వీధి ‘కెన్సింగ్ టన్ ప్యాలెస్ గార్డెన్స్’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో రెండో స్థానంలో ఉంది. ప్రముఖ అంతర్జాతీయ రియల్టీ సంస్థ నైట్ ఫ్రాంక్ నుంచి వెల్తెక్స్ అనుబంధ సంస్థ సేకరించిన వివరాల ప్రకారం మిట్టల్ నివసిస్తున్న కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ వీధిలో చదరపు మీటర్ సగటు విలువ 1,07,000 డాలర్లు (దాదాపు రూ. 66,34,000) పలుకుతోంది.
ఆ సంస్థ సమాచారం ప్రకారం.. హాంకాంగ్‌లోని పొల్లాక్స్ పాత్, దపీక్ గరిష్ఠంగా చదరపు మీటర్ సగటున 1,20,000(రూ. 74,40,000) డాలర్లు పలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా నిలిచింది. కాగా, ‘లండన్స్ బిలియనీర్స్ రో’గా కూడా ప్రసిద్ధి చెందిన కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లోనే ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఎంబసీలుండగా, ఇక్కడే ప్రపంచంలోని అత్యంత కుబేరుల నివాసాలూ ఉన్నాయి.
అలాంటి ఈ వీధిలోని 9ఎ, 18-19 నెంబర్లు గల ఇళ్లు లక్ష్మీ మిట్టల్వే. 2004లో 128 మిలియన్ డాలర్లతో మిట్టల్ కొనుగోలు చేసిన ఇక్కడి ఇంటికి తాజ్‌మహల్ నిర్మాణానికి వినియోగించిన పాలరాయి సేకరించిన క్వారీ నుంచే తీసిన పాలరాయిని వాడటం విశేషం. అక్కడ భవంతులు దాదాపు 195 మిలియన్ డాలర్ల(రూ. 1209 కోట్ల) ధర వద్ద చేతులు మారుతూ ఉంటాయి. ఇదిలావుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మూడో స్థానంలో చదరపు మీటర్ 86,000 డాలర్లు పలుకుతున్న మోనాకోలోని ఎవెన్యూ ప్రిన్సెస్ గ్రేస్ ఉంది.
నాలుగో స్థానంలో చదరపు మీటర్ 79,000 డాలర్లుగా ఉన్న ఫ్రాన్స్‌లోని బెలౌడు జనరల్ డీ గౌల్లె క్యాప్ ఫెర్రత్ ఉంది. ఆ తర్వాత సింగపూర్‌లోని పాటర్సన్ హిల్ (42,500 డాలర్లు), జెనివాలోని చెమిన్ డీ రూత్ (37,000), సర్దినియాలోని రొమాజ్జినో హిల్ (32,900), మాస్కోలోని ఒస్టోజెంకా (29,000), న్యూయార్క్‌లోని ఫిఫ్త్ ఎవెన్యూ (28,000), పారిస్‌లోని ఎవెన్యూ మోంటైజిన్ (26,000 డాలర్లు) ఉన్నాయి. బిలియనీర్లకు సగటున నాలుగేసి ఇళ్లు ఉన్నాయని, వాటిలో అనేకం లండన్, న్యూయార్క్, ప్యారిస్ వంటి నగరాల్లో ఉండడం మరో విశేషంగా ఆ సంస్థ పేర్కొంది.


