కులకర్ణి కేసులో కొత్త కోణం!
ముంబయి, సెప్టెంబర్ 9: రెండువేల కోట్ల రూపాయల అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది. తానొక యోగిని అని, నిర్దోషిని అని చెప్పింది. ‘‘నేనొక యోగిని. గత 20 ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని’’ అని రికార్డు చేసిన వీడియో టేపులో మమత చెప్పింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉంటోంది. డ్రగ్స్ కేసులో తన పేరును అక్రమంగా ఇరికించిన మహారాష్ట్ర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, కిరెన్ రిజిజులకు లేఖ రాసింది.
కాగా ఈ కేసులో మమతా కులకర్ణి బ్యాంక్ ఖాతాలను ఇటీవల మహారాష్ట్ర పోలీసులు స్తంభింపజేశారు. గుజరాత్, ముంబయి ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో మమతకు ఉన్న కనీసం 8 ఖాతాలను ఆపివేసినట్టు థానె పోలీసులు శుక్రవారం ఇక్కడ మీడియాకు చెప్పారు. మమతా కులకుర్ణితో సహజీవనం చేస్తున్నట్టు భావిస్తున్న విక్కీ గోస్వామి కూడా డ్రగ్స్ రాకెట్ కేసులో నిందితుడు. ముంబయిలో వెలుగుచూసిన అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో మమత, విక్కీ గోస్వామితో పాటు మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు.
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి కానిస్టేబుల్ నిర్వాకం
బహ్రైచ్, సెప్టెంబర్ 9: సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఓ కానిస్టేబుల్ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో కానిస్టేబుల్ క్రిమినల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనీష్ కశ్యప్ గర్ల్‌ఫ్రెండ్ శారదతో కలిసి ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు. సెప్టెంబర్ 6న ఓ పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఈ జంట 35 లక్షలు ఇస్తేనే బాబును వదిలేస్తామని బెదిరించారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కానిస్టేబుల్ వాహనాన్ని ట్రాక్ చేసిన పోలీసులు బాలుడిని విడిపించారు. మనీష్ కశ్యప్, అతడి గర్ల్ఫ్రెండ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


