కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): గోదావరి, ప్రాణహిత నదుల వెంట అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి రహదారి సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఐదు ప్రాంతాలకు రహదారి నిర్మాణం కోసం రూ.300 కోట్ల నిధులు గ్రామీణ రహదారి ప్రణాళిక (ఆర్.ఆర్.పి) కింద మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గొదావరి, ప్రాణహిత నదుల వెంట జాతీయ రహదారి నిర్మాణానికి రూ.1290 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని అనుమతులు పొందిన ఈ రహదారి నిర్మాణ పనులకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసేందుకు చొరవ చూపాలని సిఎం కోరారు. ఈ రెండు వినతులతో కూడిన పత్రాలను రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేశారు.
రెండవ రోజు హస్తిన పర్యటనలో భాగంగా గురువారం రాజ్‌నాథ్‌ను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు కె. కేశవరావు, జితేందర్ రెడ్డి, బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు వున్నారు. గ్రామీణ రహదారుల పథకం కింద చేపట్టే పనులకు సంబంధించి అదనపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి గురువారం రాజ్‌నాథ్ సింగ్‌కు అందించారు.
కాళేశ్వరం నుంచి అర్జున్ గుట్ట వరకు రహదారి, కాళేశ్వరం వద్ద కిలోమీటర్ పొడవైన వంతెన (గోదావరి), రాచర్ల-వేమనపల్లి రహదారి, సోమిని–గూడెం రహదారి, గూడెం-బాబాసాగర్ రహదారుల నిర్మాణానికి రూ.300 కోట్లు మంజూరు చేయాలని సిఎం కోరారు. అటవీ ప్రాంతంలో వున్న ఈ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు సాగించడానికి ఈ రహదారుల నిర్మాణం అత్యవసరమని సిఎం చెప్పారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం (సారపాం) నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు గోదావరి, ప్రాణహిత వెంట జాతీయ రహదారి మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి పనులు ప్రారంభించాలని కోరారు. ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర త్వరగా వేసేలా చూడాలన్నారు.


