కేసీ ఆయకట్టుకు నీటి కొరత లేదు: ఈఈ
- 78 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
కర్నూలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): కర్నూలు–కడప ప్రధాన కాల్వ కింద ఆయకట్టుకు నీటి కొరత రానివ్వబోమని కేసీ కెనాల్ ఈఈ మల్లికార్జున తెలిపారు. బుధవారం నంద్యాల కేసీ కెనాల్ ఈఈ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్నూలు–కడప జిల్లాల్లో మొత్తం కేసీ ఆయకట్టు 2.65లక్షల ఎకరాలు ఉండగా 2.05లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారన్నారు. తుంగభద్ర డ్యాం కేసీకి నీటివాటా రావడం లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇప్పటికే కేసీ కెనాల్‌కు 8 టీఎంసీల నీటిని విడుదలకు చర్యలు చేపట్టామన్నారు.
రబీలో ఆయకట్టు రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారుల సమన్వయంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాగా, పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి 16వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండగా శ్రీశైలం జలాశయంలో 874.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.
పోతిరెడ్డిపాడు ద్వారా ఎస్సారెమ్సీ కాల్వలోకి 2,000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా హంద్రీనీవా సుజలశ్రవంతి పథకం ద్వారా 1680క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000క్యూసెక్కులు, కేసీ కాల్వకు 500, ఎస్సార్బీసీకి 500క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తిచేస్తూ 7,416 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు గేజింగ్ అధికారులు తెలిపారు.
మరోవైపు, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూడు మిద్దె ఇళ్లు కూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాటి కింద ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత భవనాలన్ని పునాధులతో సహా నానిపోయాయి. దీంతో స్థానికులు తమకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ప్రత్తిపాటి
కర్నూలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ప్రకృతి వ్యవసాయం రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు తద్వారా ఆర్థికాభివృద్ది, ఆరోగ్యాభివృద్ధి సాధించడం ద్వారా ఉయ్యాలవాడ రైతులు పలువురికి స్పూర్తిగా నిలిచి చరిత్ర సృష్టించారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సేవా గ్రామాభివృధ్ది సంస్థ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యాలయ సమావేశ భవనంలో రైతు మహిళాసదస్సు, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి చక్రపాణిరెడ్డి, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎం.రాజశేఖర్, జాయింట్ కలెక్టరు సి.హరికిరణ్, వ్యవసాయశాఖ జెడి. ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సి.ఎస్. విజయకుమార్, వ్యవసాయశాఖ డైరెక్టరు ధనుంజయరెడ్డి, ఓర్వకల్ మహిళా స్వయం సహాయక సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతి, సర్పంచు లక్ష్మిదేవమ్మ, ఎంపిపి వెంకటరమణారెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు, రైతు సంఘాల సభ్యులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఉయ్యాలవాడలో ప్రారంభించడం హర్షదాయకమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని, ఉత్పాధన వ్యయం లేకుండా ప్రకృతి వనరులకు నష్టం కలుగకుండా సహజ వనరులతో చేసే వ్యవసాయం అయినందున ప్రజల ఆరోగ్య పరిరక్షణ చేస్తుందని భావించి ప్రోత్సహం అందించుటకు సిద్దంగా ఉన్నారన్నారు. మార్కెటింగ్ కూడా సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ప్రకృతి వ్యసాయం ప్రతి రైతూ చేపట్టి ఆర్థికాభివృధ్ది, ఆరోగ్యాభివృధ్దిని పెంపొందించుకోవాలని, ఇతరులకు కూడా అందచేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం బలపడితే పంట ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు పంపి మార్కెట్ చేయడం కూడా జరుగుతుందన్నారు. ఉయ్యాలవాడ గ్రామంలో ఇప్పటి వరకు రూ. 25 కోట్ల రూపాయల టర్న్ఓవర్ సాధించడం హర్షించతగ్గ విషయమన్నారు. సిస్టం బాగా పనిచేస్తే అంతులేని ఫలితాలు సాధించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మునిరత్నంనాయుడు 600 కోట్ల రూ.ల టర్న్ఓవర్ చేయించారని, అది వంద శాతం రీపేమెంటు ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అదే విధంగా తీసుకున్న రుణాలను గడువులోగా వంద శాతం చెల్లింపులు చేయగలిగితే ఆర్థికాభివృధ్ది తప్పక సాధించగలమన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి జరపాలన్నారు. ఉయ్యాలవాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా లక్ష వరకు వడ్డీ లేని రుణాలు, రూ. 3 లక్షల వరకూ పావలావడ్డీ రుణాలకు రైతులకు సంఘాలు ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ది పొందుతున్నారన్నారు. ప్రతి క్లస్టరుకు ఒక బ్యాంకు ఏర్పాటు చేయుటకు యోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రం, దేశం మొత్తం ఉయ్యాలవాడ వైపు చూస్తూ ఇక్కడికి వచ్చి పరిశీలనలు జరిపి ప్రగతి సాధించే విధంగా రైతులు వ్యవహరించడం భవిష్యత్తులో మంచి తప్పక జరుగుతుందన్నారు. ఉల్లి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దంగా ఉన్నామని తెలుపమన్నారని నష్టాన్ని భరించి ఉల్లి రైతుల నుంచి కేజీకి రూ. 7/-లు చెల్లించి ఉల్లినంతా కొనుగోలు చేస్తామని, ఇతర జిల్లాలకు, డిమాండు వున్న ప్రాంతాలకు ఉల్లిని అమ్మాకాలు జరుపుతామని ఈ సందర్భంగా మంత్రి రైతులకు తెలిపారు. వ్యవసాయ శాఖ కమీషనరు విజయకుమార్ మాట్లాడుతూ ఉయ్యాలవాడలో ప్రయోగాత్మకంగా రైతు ఉత్పత్తి దారుల సమావేశం ఏర్పాటు, ప్రకృతి వ్యవసాయం చేపట్టామని, ఇక్కడ స్పూర్తితో మిగతా 139 క్లస్టర్లతో రైతు సంఘాలు ఏర్పటు చేయనున్నామన్నారు. గౌరవ జయరాం రమేష్ తన ఎంపి ల్యాడ్స్ నుండి రూ. 25 లక్షలతో భవననిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని మిగిలిన 15 లక్షల రూపాయలను పొదుపు సంఘాలు భరించి నిర్మించుకోవడం జరిగిందని తెలుపుతూ మండల సమాఖ్య, గ్రామైక్య సంఘం, రైతు సంఘాల సభ్యులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు వెంకటేశ్వర్లు, ఎ.మద్దిలేటి మంత్రివర్యులతో ముఖాముఖి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా లబ్ది పొందామని, సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పొదుపు అనేది మహిళలతో పాటు పురుషులకు అత్యవసరమని, అవసరాలకు అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రతి పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలని, రైతుల వ్యవసాయాభివృద్ధికి సదుపాయాలు కల్పించాలని, ప్రోత్సాహం అందించాలని కోరారు. ఓర్వకల్లు పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం గౌరవ సలహాదారు విజయభారతి మాట్లాడుతూ గ్రామంలో స్వయం సహాయక బృందాల కుటుంబాలు 60 శాతం పేదరికం నుండి బయటపడి మెరుగైన జీవితం గుడుపు తున్నాయని ఇందుకు సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రికి అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత 9 నెలల నుండి సంఘ సభ్యురాళ్లు తమ భర్తలను, రైతులను సంఘాలలోకి రావడానికి కృషి జరిపారని వారు కూడ చైతన్యవంతులయి జీవితంలో బాగుపడతారన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడుల కోసం రైతు మిత్ర సంఘాలకు రూ. 25000/-ల విలువగల చెక్కులను 10 సంఘాలకు మంత్రి, అతిధులు అందజేశారు.
మహిళల ఆర్ధిక ఎదుగుదలకు పొదుపులక్ష్మి చేయూత
కర్నూలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): రైతు మిత్ర గ్రూపులను బలోపేతం చేసి వ్యవసాయ సంక్షోభం నుండి రైతు సోదరులను ఆదుకునేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం ఓర్వకల్లు మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహిళా సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టరు సి.హెచ్.విజయమోహన్, వ్యవసాయశాఖ స్పెషల్ సెక్రటరీ విజయకుమార్, వ్యవసాయశాఖ కమీషనర్ ధనుంజయరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దేశ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఓర్వకల్లు మండల ఐక్య సంఘం ఆధ్వర్యంలో రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేసి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి లాభసాటిగా మార్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఓర్వకల్లు మండల పొదుపు ఐక్య సంఘాలు క్రమశిక్షణకు మారుపేరని పట్టుదలతో సాధించే కృషి, నమ్మకం వ్యక్తం అవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 131 ఆర్గానిక్ క్లస్టర్లులో ఒక్కో క్లష్టర్‌లో 4గురు వ్యక్తులతో 20 వేల గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు 2.5 లక్షల మంది రైతులచే పొదుపు చేయించనున్నామన్నారు. దేశంలోనే ఇది పెద్ద కార్యక్రమం అని ఇతర కార్యక్రమాలకు కూడ ఆదర్శవంతంగా నిలుస్త్తుందని మంత్రి అన్నారు. ఓర్వకల్ డ్వాక్రా గ్రూపులను సియంగారు మెచ్చుకుంటున్నారని ఆ నమ్మకంతోనే రైతు మిత్ర గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను పొదుపు మహిళా ఐక్య సంఘానికి అప్పజెప్పామన్నారు. వ్యవసాయంలో నూతన పద్దతులను అవలంభించి సేంద్రీయ ఎరువులతో పంటలను కాపాడి అధిక దిగుబడి సాధించడంతో పాటు మార్కెటింగ్, ఎగుమతి ప్రోత్సహించే దిశలో కూడ ప్రభుత్వం యోచిస్త్తోందన్నారు. ఐక్య సంఘాల కార్యకలాపాలను సియం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం తరపున మరింత అభివృధ్ది చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటు విజయభారతి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఓర్వకల్ ప్రాంతానికి హెచ్.ఎన్ ఎస్ఎస్ ద్వారా నీటి వసతి కల్పించాలన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విన్నపాన్ని సియం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానన్నారు. ఓర్వకల్లో అనేక ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి నీటి ఆవశ్యకత వుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించాలన్నదే సియం ఆశయమన్నారు. ఉల్లి, మొక్కజొన్న పంట దిగుబడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. మినుములు, పెసలు, సెనగలు 40 శాతం సబ్సిడీపై 98 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించడంతో పాటు రెయిన్గన్లతో పంటలను కాపాడేందుకు సిద్దంగా వున్నామని మంత్రి వివరించారు. ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్ మండల తరహాలోనే శ్రీశైల నియోజకవర్గాన్ని కూడ దత్తత తీసుకొని అభివృధ్ది చేయాలని కోరారు. వ్యవసాయశాఖ స్పెషల్ సి.యస్ విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక పరిశోధన సంస్థలు, ఆహార సలహా సంఘాలు ఫర్టిలైజరు, క్రిమి సంహారక మందుల వాడకంతో అనేక సమస్యలు వచ్చే ప్రమాదం వున్నట్లు గుర్తించాయని ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని ఈ దిశలో రైతులను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించి దేశానికి ఆదర్శం కావాలని కోరారు. జిల్లా కలెక్టరు సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ పొదుపు ఐక్య సంఘాలు విజయం సాధించిన తరహాలోనే వ్యవసాయదారులకున్న సమస్యలను గట్టెక్కించి జీవన ప్రమాణాలు పెంపొందించే దిశలో రైతు మిత్ర గ్రూపులు తోడ్పాటు నందించాలన్నారు. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వ్యవసాయశాఖ కమీషనరు ధనుంజయరెడ్డి, కెడిసిసి ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు రైతు మిత్ర గ్రూపుల లక్ష్యాన్ని వివరించారు. అనంతరం ఒక్కో సంఘానికి 50 వేల రూ.ల చొప్పున మంత్రి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దయ్య, ఆర్.డి.ఓ రఘుబాబు, వ్యవసాయశాఖ జెడి ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పొదుపు ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి మాట్లాడుతూ మండల సమాఖ్య సాధించిన విజయాలను వివరించారు.


