కొడితే ఊరుకోం..! విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ హెచ్చరిక
- 77 Views
- admin
- May 21, 2018
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా
పోలీసులకు సమాచారం ఇవ్వండి
కొట్టినట్టు తేలితే క్రిమినల్ కేసు పెడతాం
విశాఖ క్రైం, ఫీచర్స్ ఇండియా: బీహార్ ముఠా…దొంగల ముఠా..అంటూ అనుమానితులపై అకారణంగా కొట్టే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ హెచ్చరించారు. కమిషనరేట్ సమావేశపు మందిరంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎవరిని కొట్టినా నేరమేనని గుర్తు చేసుకోవాలన్నారు. అనుమానితులపై దాడి చేసే చర్య అమానుషమని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనుమానిలనే కారణంతోనే వారిపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఏదైనా సంఘటన జరిగినా, అనుమానితులగా సంచరించినా ఆ విషయాన్ని పోలీసులకు 0891-2565454, వాట్సప్ నెంబర్ 9493336633కు పంపించాలని కోరారు. రోడ్లపై తిరిగే వ్యక్తులందరిపై దాడులు చేయడం సరికాదన్నారు. వన్‌టౌన్‌లోని గొడారిగోతుల వీధిలో ఓ అనుమానితుడ్ని చంపేసిన కేసుకు సంబంధించి అశోక్‌కుమార్, ఇమ్రాన్, ఏసు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్టు ప్రకటించారు. చిత్తూరు, కడప, తమిళనాడు వంటి ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీల వల్ల ఆ ప్రాంతంలో కొందరు ఇలాంటి పుకార్లను సోషల్ మీడియాలో పెట్టి లబ్ది పొందాలనుకున్నారని ఆ విషయం నేడు విశాఖలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుందని చెప్పారు. అందుకే అనుమానితుల జోలికి ఎవరూ పోవద్దని వివరించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు రవికుమార్ మూర్తి, నాగేంద్ర, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


