కొడుక్కి షాకిచ్చిన ములాయం!
లక్నో, అక్టోబర్ 26: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ విభేదాలు రోజురోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి తేజ్ నరైన్ పాండే అలియాస్ పవన్ పాండేను పార్టీ నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఆయనపై పార్టీ ఆరేళ్ల పాటు వేటు వేసిందని రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ వెల్లడించారు. పార్టీ సమావేశంలో పవన్ పాండే ఎస్పీ ఎమ్మెల్సీ ఆశు మాలిక్‌పై దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆయనపై చేయి చేసుకున్నాడని తెలిపారు. అమర్యాదకరంగా ప్రవర్తించినందుకుగాను సమాజ్‌వాదీ పార్టీ నుంచి పవన్ పాండేను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివపాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని సీఎం అఖిలేశ్ యాదవ్‌కు శివపాల్ లేఖ ద్వారా తెలిపారు. ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీఎం అఖిలేశ్ యాదవ్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడికి వచ్చిన పవన్ పాండే దాడి చేశారని, రెండు సార్లు చెయ్యి చేసుకున్నారని ఎమ్మెల్సీ ఆశుమాలిక్ వెల్లడించారు. ఆ ఘటన జరిగిన సమయంలో సీఎం అఖిలేశ్ ఇంట్లో లేరని తెలిపారు. దీనిపై రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. మరోవైపు, గత మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కీలక నేతగా ములాయం సింగ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా అభివృద్ది చేయాలన్న ఆకాంక్ష ఉన్న యువనేతగా ఆయన తనయుడు అఖిలేశ్‌కు పేరుంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్నాలజీని సంప్రదాయతను జోడించి పార్టీకి అనితరమైన విజయాన్ని అందించిన అఖిలేశ్ యాదవ్ మధ్య సాగుతున్న అంతర్గత పోరు చివరికి పార్టీకే ముప్పు తెచ్చేలా ఉంది. ములాయంసింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేశ్ చిన్నాన్న శివపాల్‌యాదవ్‌తో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. క్వామీ ఏక్తాదళ్ పార్టీని విలీనం చేసుకోవద్దని అఖిలేశ్ ఆదేశించినా శివపాల్ పట్టించుకోకుండా ఆ పార్టీని ఎస్పీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అఖిలేశ్ విముఖతతో విలీనం ఆగలేదు. ఆ సమయంలో రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో సీబీఐ విచారణ సరైనదని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మైనింగ్ శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతి, పంచాయతీరాజ్ మంత్రి రాజ్కిశోర్సింగ్లను మంత్రివర్గం నుంచి తొలిగించారు. వీరు శివపాల్ వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్‌ను ములాయం తప్పించారు. శివపాల్ వద్ద ఉన్న అనేక కీలకశాఖలను అఖిలేశ్ తొలగించారు. ఈ చర్యకు ఆగ్రహించిన శివపాల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ములాయం ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే తాజాగా సీఎంకు గట్టి మద్దతుదార్లుగా భావిస్తున్న ఏడుగురు నేతలను శివపాల్ యాదవ్ పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ప్రతిగా శివపాల్‌తో పాటు మరో ముగ్గురిని మంత్రివర్గం నుంచి తొలగించారు. చివరకు పార్టీ సమావేశంలో ములాయం మధ్యవర్తిత్వంతో ఇరువర్గాలకు తిరిగి రాజీ కుదిరింది. అయితే ఈ సయోధ్య ఎన్నాళ్లు వుంటుందన్నదే సందేహం. పార్టీలో నెలకొన్న సంక్షోభం వెనుకపార్టీ నేత అమర్‌సింగ్ పాత్ర వుందని అఖిలేశ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయిన అమర్‌సింగ్ రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే పార్టీని నెలకొల్పాడు. ఈ ఏడాది మే నెలలో ఎస్పీలో తిరిగి సభ్యత్వం పొందాడు. అఖిలేశ్ ఎంతగా వ్యతిరేకించినా ములాయం సింగ్ తన ఒకప్పటి స్నేహితుడిని సాదరంగాపార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చింది అమర్‌సింగేనని ములాయంకు గట్టినమ్మకం. అమర్‌సింగ్ ఠాకూర్ వర్గానికి చెందినవారు. దీంతో ఆ వర్గానికి చెందిన అమర్‌ను వదులుకునేందుకు ములాయం సిద్ధంగా లేరు. సమాజ్‌వాదీపార్టీలో ములాయం బంధువర్గానిదే కీలకపాత్ర. ఆ వర్గానికి చెందినవారే ప్రముఖపదవుల్లో వుంటారు. ములాయం పెద్ద భార్య మాలతి దేవి కుమారుడు అఖిలేశ్‌యాదవ్ సీఎం, ఆయన సతీమణి డింపుల్ ఎంపీగా వున్నారు. ములాయం సోదరుడు శివపాల్ రాష్ట్ర ఎస్పీశాఖ అధ్యక్షుడు. ములాయం పెద్ద సోదరుని కుమారుడు ధర్మేంద్రయాదవ్, బడౌన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహస్తున్నారు. మరో సోదరుడు రతన్‌సింగ్ కుమారుడు తేజ్‌ప్రతాప్‌సింగ్ మెయిన్‌పురి నుంచి ఎంపీగా వున్నారు. ములాయం చిన్నాన్న కుమారుడు రాంగోపాల్ యాదవ్ రాజ్యసభ ఎంపీగా, ఆయన కుమారుడు అక్షయ్‌యాదవ్ ఫిరోజాబాద్ ఎంపీగా వున్నారు. ములాయంసింగ్ యాదవ్ రెండో భార్య సాధనాసింగ్ కుమారుడు ప్రతీక్యాదవ్కు రాజకీయాలపై ఆసక్తి లేదు. ఆయన సతీమణి అపర్ణ రానున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై ఎస్పీలో జరుగుతున్న కుమ్ములాటలు ప్రభావం చూపే అవకాశముంది. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలే అఖిలేశ్‌కు అండగా నిలిచారు. అయితే ములాయంకు యూపీలో ప్రత్యేకమైన ప్రజాదరణ వుంది. ఒక వేళ పార్టీ చీలిపోతే ఇరువర్గాల నేతలు మరింత నష్టపోయే ప్రమాదముంది. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, అభివృద్ధి లేమి, అవినీతిపై ఇప్పటికే భాజపా, బీఎస్పీలు ప్రచారం ప్రారంభించాయి. ఎస్పీలో కుమ్ములాటలతో ప్రతిపక్షాలు మరింత లబ్ది పొందుతాయన్న వ్యాఖ్యలో ఎటువంటి సందేహంలేదు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ నివాసంలో బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అఖిలేశ్ యాదవ్ చేపట్టనున్న రథయాత్రపై ఎస్పీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్పీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అఖిలేశ్‌యాదవ్ చేపట్టనున్న రథయాత్ర ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే.


