కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలు స్వీకరణ
- 95 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్టైమ్): కొత్త జిల్లాల విభజనపై ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైశాల్యంలో, భౌగోళికపరంగా జిల్లా పెద్దగా ఉండడం, రెండు జిల్లాలుగా విభజించాలని ప్రజల కోర్కెకు భిన్నంగా మూడు జిల్లాలుగా విభజించడంపై ప్రజలు, పేద వర్గాలు, వివిధ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాను రెండుగా విభజిస్తే సమత్తమని, తాజాగా నిర్మల్ ప్రాంతాన్ని జిల్లాగా విభజించడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనకార్యక్రమాలు కొనసాగుతుండగా, మరోవైపు ఆదిలాబాద్ కేంద్రంలో నిర్మల్ జిల్లా వందంటూ గత ఏడు రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
జిల్లాల విభజన నేపథ్యంలో ఇప్పటివరకు 700 అభ్యంతరాలు వచ్చాయి. అత్యధికంగా జిల్లాల ఏర్పాటుపై రాగా, కొత్త మండలాల ఏర్పాటుపై, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల నుండి ప్రభుత్వానికి అర్జీలు అందాయి. జిల్లాలోని బాసర, పెండి, పెంచికల్పేట, సోన్, చింతమడక ప్రాంతాలను కొత్త మండలాలుగా చేయాలని, జెన్నారం మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలపాలని, ఇచ్చోడ, నేరేడుగుండ మండలాలను ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లో కొనసాగించాలని, నేరేడుగుండ మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలపాలని, కొత్తగా నిర్మల్ జిల్లా ఏర్పాటును ఆ ప్రాంత ప్రజలు స్వాగతిస్తూనే ఈ జిల్లాకు బాసర పేరు పెట్టాలని పెద్ద ఎత్తన విజ్ఞప్తులు అందుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆయా ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తూ కొత్తగా ప్రతిపాదించడం, ఆయా ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, తదితర నిరసన ప్రదర్శనలను కొనసాగుతూనే ఉన్నాయి.


