కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ‘గెస్టు’ల ఖరారు
- 79 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలను దసరా రోజు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్న కేసీఆర్ సర్కార్ అందులో భాగంగా ఆయా జిల్లాలను లాంఛనంగా ప్రారంభించే ‘అతిధు’లను కూడా ఖరారుచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో బుధవారం తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయి కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి తుది రూపు ఇచ్చారు.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లాలో మాత్రమే కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగిలిన జిల్లాల ప్రారంభోత్సవానికి ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కార్యాచరణ సిద్ధంచేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఇక, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ జనగామ జిల్లాను ప్రారంభించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి భూపాలపల్లి, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ జగిత్యాల, మరో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వరంగల్ రూరల్, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి యాదాద్రి, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్ పెద్దపల్లి, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి, టి. పద్మారావు మంచిర్యాల, పి. మహేందర్ రెడ్డి వికారాబాద్, సీఎం కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల, జోగు రామన్న ఆసిఫాబాద్, జి. జగదీష్ రెడ్డి సూర్యాపేట, తుమ్మల నాగేశ్వర్ రావు కొత్తగూడెం, ఎ. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్, తలసాని శ్రీనివాసయాదవ్ గద్వాల, సి. లక్ష్మారెడ్డి నాగర్ కర్నూల్, అజ్మీరా చందూలాల్ మహబూబాబాద్, జూపల్లి కృష్ణారావు వనపర్తి, సి.ఎస్. రాజీవ్ శర్మ: మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లాలను ప్రారంభించనున్నారు. ఈమేరకు నిర్ణయించిన ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేసింది.


