కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు రూ.లక్ష జరిమానా
- 88 Views
- wadminw
- December 22, 2016
- రాష్ట్రీయం
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌కు షాక్ తగిలింది. అనవసరంగా విలువైన కోర్టు సమాయాన్ని వృధా చేసినందుకు పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి రూ. లక్ష జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అమ్మ మరణించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ పిటిషనర్ ఒకరు పిటిషన్ జారీ చేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు పిటిషనర్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిటిషన్‌పై విచారణ సమయంలో జయలలితకు వారసులు ఎవరూ లేరన్న వాదనను పిటిషనర్ వాదించడం, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ లేదరా అన్న ప్రశ్నకు తమకు సమాచారం తెలియదన్న పిటిషనర్ వైఖరిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం… జయలలితకు సోదరుడు ఉండడం, ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్న నేపథ్యంలో ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనవసరంగా విలువైన కోర్టు సమాయాన్ని వృధా చేసినందుకు పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి రూ.లక్ష జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పిటిషన్ల కారణంగా కోర్టు సమయం వృధా కావటమే కాదు అనవసరమైన గందరగోళానికి కారణమవుతుందన్న వ్యాఖ్యను చేసింది. తాజా తీర్పుతో సంచలనాల కోసం పటిషన్లు దాఖలు చేసే వారి జోరుకు బ్రేకులు పడటం ఖాయం.


