కోస్టల్ కారిడార్‌కు రూ. 1350 కోట్ల ఏడీబీ రుణం
- 102 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): చెన్నై- వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్థిలో భాగంగా రాష్ట్రంలో కోస్టల్ రోడ్డుకు రూ. 1350 కోట్ల ఎడిబి రుణం మంజూరైనట్లు ఆర్ధిక, ప్రణాళిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారంనాడు కాకినాడ సమీపంలోని తిమ్మాపురం అతిధి గృహంలో జిల్లా అభివృధ్ధి పై వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ కోస్టల్ రోడ్డు చేపట్టడం ద్వారా రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల అభివృధ్ధితో పాటు, తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల అభివృధ్ధికి దోహద పడుతుందని అన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన పనులు జిల్లాలో చేపట్టడానికి సిధ్ధం కావాలన్నారు.
అదే విధంగా జిల్లాలోని గోదావరి నది పై పురుషోత్తపట్నం వద్ద రూ . 1650 కోట్ల తో ఎత్తిపోతల పధకాన్ని చేపట్టడానికి కూడా నిధులు విడుదల చేయనున్నామని మంత్రి తెలిపారు. పోలవరం ఎత్తిపోతల పధకం ద్వారా ఏలేరు అనుసంధానం, స్థానిక సాగు నీరు అందించడం వైజాగ్ స్టీలు ప్లాంట్‌కు నీరందించడంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలలోని సుజల స్రవంతికి కలుపుతారని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులలో 4,5 రీచ్‌ల పనులకు రూ. 300 కోట్లు విడుదల చేస్తున్నామని , మిగిలిన పనులకు 300 నుండి 400 కోట్ల అవసరమవుతాయని, తొందరలో ఈ నిధులు కూడ ఇస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ఖజానా శాఖ నుండి బిల్లులు పొందడానికి నూతన విధానం అమలు చేస్తున్నామని, ప్రతి నెలా 7 నుండి 25 వరకూ వివిధ శాఖల పనులకు సంబంధించిన బిల్లులు ఖజానాలు అనుమతిస్తారని, 26 నుండి తదుపరి నెల 6 వరకు ఉద్యోగుల జీత భత్యాలు, పింఛన్లకు చెందిన బిల్లులు అంగీకరిస్తారని, ఈ మేరకు వివిధ పనులకు చెందిన బిల్లులు నిర్దేశించిన కాలంలో సమర్పించి, పెండింగ్ బిల్లులు క్లీయర్ చేయాలన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల నుండి లబ్దిదారుల వ్యక్తిగత రుణాల మంజూరును రూ. ఒక లక్షగా నిర్ణించడం జరిగిందని యనమల తెలిపారు. రాష్ట్రంలో ఫిష్ హేచరీస్లను క్రమబద్దీకరించి వాటికి లైసెన్సులు ఇవ్వాలని మంత్రి సూచించారు.
జిల్లాలోని తొండంగి మండలంలో హేచరీ యజమానులు తనకు ఈ విషయమై విజ్ఞాపన ఇచ్చారని, రాష్ట్రలోని ప్రాధమిక రంగాల్లో సాధించిన 22.7 శాతం ఆర్ధిక అభివృధ్ధిలో 34 శాతం రేటు మత్స్యశాఖ నుండే వస్తుందని అన్నారు. ఈ హేచరీల నిర్వహణలో నాణ్యత గల ఉత్పత్తి కోసం సాంకేతిక పరమైన సూచనలు ఇవ్వాలన్నారు. పౌరసరఫరాల శాఖలో ఇ-పోస్ అమలు ద్వారా వస్తున్న పొదుపును ఆ శాఖ బడ్జెట్లో ప్రతిబింబించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ జిల్లాలో జరుగుతున్న అభివృద్థిని ఆర్థిక మంత్రికి వివరించారు.జిల్లాలో వివిధ పనులకు పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలక్టర్ యస్.సత్యన్నారాయణ , జేసి-2, జే.రాధాకృష్ణమూర్తి, ఇరిగేషన్ ఎస్ఇ రాంబాబు, ఆర్ అండ్ బి యస్ఇ మూర్తి, పంచాయతీరాజ్ ఎస్ఇ వి.వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడి కెయస్వి ప్రసాద్, డిఆర్డిఏ పిడి యస్.మల్లిబాబు, డ్వామా పిడి ఎ.నాగేశ్వరరావు, హౌసింగ్ పిడి సెల్వారాజ్, డిసిఓ టి.ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.


