గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు
- 106 Views
- wadminw
- September 15, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (న్యూస్‌టైమ్): నవరాత్రులు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గురువారం ఖైరతాబాద్ నుంచి అత్యంత వైభవంగా సాగిన వూరేగింపుతో ట్యాంక్‌బండ్‌కు చేరిన గణనాథుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ క్రేన్ సాయంతో నిర్వహించిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది ప్రజలు తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రజలు వినాయకుడికి వీడ్కోలు పలికారు. కాగా, బాలాపూర్ గణేశ్ గ్రామోత్సంగురువారం ఉదయం ఘరంగా జరిగింది. గణనాథుడికి ఈ ఏడాది చివరి పూజ నిర్వహించారు.
అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. యాత్ర అనంతరం స్వామివారి లడ్డూ వేలంపాట నిర్వహించారు. లెక్కలో మొదటి నుంచీ ఎక్కువ ధర పలికే బాలాపూర్ లడ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయిలోనే అమ్ముడయింది. రూ.14.65లక్షలకు స్కైలాబ్‌రెడ్డి బాలాపూర్ గణేశ్ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాటలో మొత్తం 25 మంది పాల్గొనగా అందులో ఈసారి నలుగురు స్థానికేతరులు కూడా ఉన్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూను కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి రూ.10.32 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న స్కైలాబ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట ప్రక్రియ 1980 నుంచి ప్రారంభమైంది.
లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తుంది. కాగా, రికార్డు స్థాయిలో ధర పలికి చరిత్ర సృష్టించిన బాలాపూర్ లడ్డూ ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? మొట్టమొదటి సారి 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి రూ. 450కి ఆ లడ్డూను వేలంలో పాడుకున్నారు. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లోనే ప్రారంభమైనా లడ్డూ వేలం మాత్రం తొలిసారి 1994లోనే నిర్వహించారు. తొలి వేలం తర్వాత అది బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆ తర్వాతి సంవత్సరం ఏకంగా పది రెట్లు పెరిగి రూ. 4,500 వరకు వేలం వెళ్లింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ఎంతవరకు వెళ్లిందనే విషయం బాగా ఆసక్తికరంగా మారింది.
వేలంలో పాడుకున్న వాళ్ల ఆ లడ్డూను తమ పొలంలో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం ఉండటం వల్ల కూడా ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులు ఆ తర్వాతి నుంచి ఎక్కడివారైనా వేలంలో పాల్గొనచ్చని తెలిపారు. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు.
మరోవైపు, భాగ్యనగరంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లోని మండపాల్లో వినాయకుడి వద్ద ఉంచి లడ్డూలకు వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డూలను పలువురు భక్తులు రూ.లక్షల్లో పాడుకుని సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ 14.65లక్షలకు వెళ్లగా, ఎస్ఆర్ నగర్‌లోని మధురానగర్‌లో రూ.9.99లక్షలు, సరూర్‌నగర్ పరిధిలోని బడంగ్‌పేటలో రూ.5.41లక్షలు, వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌లో రూ.3.35లక్షలు, మూసాపేట్ సేవాలాల్నగర్లో రూ.3.12లక్షలు, కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్‌లో 2.11లక్షలకు వేలంలో పాటదారులు సొంతం చేసుకున్నారు.
కాగా, భారీగా వర్షం కురుస్తున్నా భాగ్యనగరంలో గణేష్ శోభాయత్ర గురువారం వైభవంగా జరిగింది. ప్రజల ఆటపాటలు, భజన కోలాటాలతో మహా గణపతికి వీడ్కోలు పలికారు. నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో సజావుగా ఈ వేడుక కొనసాగింది. హుస్సేన్ సాగర్‌కు తరలిన గణనాథులతో, ప్రజల ఆటపాటలతో నగరం సందడిగా మారిపోయింది. ఎటుచూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఇక చరిత్రలో ఎప్పుడూలేనివిధంగా ముందుగానే ఖైరతాబాద్ మహగణపతిని నిమజ్జనం పూర్తయింది. అత్యంత కోలాహలం నడుమ ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనానికి బయలుదేరాగా భారీ క్రేన్ సాయంతో గణనాథుడిని ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకను చాలామంది ప్రత్యక్షంగా తిలకించారు.
గత ఏడాది వరకు అన్ని వినాయకుల నిమజ్జనం పూర్తయిన తర్వాతే ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు సమయంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవం ముగియడం విశేషం. గురువారం ఉదయం 8 గంటలకు శోభాయాత్రగా బయలుదేరిన గణనాథుడు ఈసారి ఆరు గంటల్లోనే నిమజ్జనం పూర్తిచేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రానికే గణేష్నిమజ్జనోత్సవాన్ని దాదాపు పూర్తిచేయడంలో అధికారులు విజయవంతమయ్యారు. దాదాపు గురువారం 30 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు.
హుస్సేన్ సాగర్ సహా నగరంలో పదిచోట్ల నిమజ్జనోత్సవాలు జరిగాయి. దాదాపు 100 మార్గాల నుంచి గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చారు. 225 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలో 20వేల ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, గణేష్ నిమజ్జనోత్సవంపై జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా 30 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక గణేష్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా, జంట కమిషనరేట్ల పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గురువారం రాత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గణనాధుల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు.


