గడువుకు ముందే బ్లూ ప్రింట్!
- 97 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాల ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడానికి వారం రోజుల ముందే వీటి కూర్పుపై బ్లూప్రింట్‌ను సిద్ధం చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. జిల్లాల వారీగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల కూర్పు, కలెక్టర్లు, ఎస్పీల కార్యాలయాలు, వారికి నివాస భవనాలతో పాటు పాటు జిల్లా కార్యాలయాలకు వౌలిక వసతులు, ఉద్యోగుల కేటాయింపు, ఫైళ్ల బదలాయింపు వంటి కీలక అంశాలతో బ్లూప్రింట్ రూపొందించాలని కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు.
కొత్త జిల్లాల కూర్పులో భాగంగా ఇక నుంచి అన్ని సంక్షేమ శాఖలకు కలిపి జిల్లా సంక్షేమ అధికారిగా ఇక నుంచి జిల్లాకు ఒక్కరే ఉంటారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం వీటికి వేర్వేరు శాఖలు యథాతథంగా కొనసాగుతాయని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. సంక్షేమ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన రావడానికి దోహదపడుతుందని రాజీవ్ శర్మ సూచించారు. ప్రస్తుతం జిల్లాల్లో వేర్వేరుగా ఉన్న సంక్షేమశాఖ అధికారులతో సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఒకర్ని సంక్షేమ అధికారిగా నియమించనున్నారు.
అదే విధంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, హౌసింగ్ ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఒకే అధికారి పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. కొత్త జిల్లాల్లో ట్రెజరీ ఖాతాలు తెరవడంతో పాటు ఉద్యోగుల వేతన ఖాతాలను వాటికి అనుసంధానం చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారుల జాబితాను కూడా సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనల నివేదికలు ఈ నెల 14 కల్లా కమిటీకి అందజేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీల నియామకానికి సంబంధించిన జాబితాతో సహా 15న టాస్క్ ఫోర్స్ కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనుంది. ఎట్టి పరిస్థితులలో శాఖల వారీగా నివేదికలు నిర్ణీత గడువులోగా అందాలని కమిటీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ప్రస్తుతం ఉన్న 10 పాత జిల్లాలు వదిలేసి కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు దాదాపు సగానికి పైగా ఆర్డీవో, డిఎస్పి కార్యాలయాలు ఉన్నాయని, వీటినే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలుగా మార్చాలని కమిటీ ప్రతిపాదించింది. మిగతా వాటికి అద్దె భవనాలలో వసతి సౌకర్యాన్ని కల్పించడానికి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయని, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇంకా గడువు ఉండటంతో విశాలమైన భవనాలు ఏమైనా ఉంటే వాటిని కూడా చేర్చి తాజాగా ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఆదేశించారు. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి కార్యకలాపాలు ఎలాంటి టెన్షన్ లేకుండా జరగడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.


