గర్భిణీలను వణికిస్తున్న రక్తహీనత సమస్య
- 221 Views
- wadminw
- September 3, 2016
- రాష్ట్రీయం
* ఆదిలాబాద్లో మృత్యువాత పడుతున్న మహిళలు
* సీజనల్ అంటు వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు
ఆదిలాబాద్: గిరిజన ప్రాంతాల్లో పుట్టడమే వారి పాపమా? నిరక్ష్యరాస్యతే వాళ్ల పాలిట శాపమా ? ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత వల్ల మరణిస్తున్న గర్భిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తమకు తెలియకుండానే తమ బిడ్డలకూ రక్తహీనతను వారసత్వంగా అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళల హృదయ విదారక ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత గిరిజన మహిళలను కబళిస్తోంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 78 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలిపాయి.
ప్రధానంగా గర్భిణీ స్త్రీలలో 90 శాతం మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. దీంతో వారికి జన్మించిన బిడ్డలకు సరైన పోషకాలు అందక వారు తమకు తెలియకుండానే రక్తహీనతను పొందుకుంటున్నారు. సాధారణంగా ప్రతి మనిషి రక్తంలో 14 మిల్లీ గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కాని ఏజెన్సీ ప్రాంత గర్భిణులను పరీక్షిస్తే వాళ్లలో 3 లేదా 4 మిల్లీగ్రాములకు మించి హిమోగ్లోబిన్ ఉండటం లేదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడమే దీనిక ప్రధానం కారణంగా వైద్యులు చెబుతున్నారు.
తమకు పౌష్టికాహారం లభించకపోవడం వల్లనే రక్తహీనత బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పెట్టే పథకాల్లో ఏమీ తమను ఆదుకోవడం లేదని ఆగ్రహిస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో తమ పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించి, భవిష్యత్తు తరాలు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాలలో పోషకాహార లేమి లేకుండా చర్యలు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, అడవులు, ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్లో వర్షాకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలతో వందలాది మంది మంచంపట్టారు. వైద్యం చేయడానికి ప్రభుత్వ డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. మొన్నటి దాకా ఎండకాల వ్యాధులతో బాధపడిన ప్రజలు ఇప్పుడు వర్షాకాల విషజ్వరాలతో సతమతమవుతున్నారు. ఆడుకోవాల్సిన వయస్సులో వ్యాధుల బారిన పడుతున్న చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు.
వాంతులు, విరేచనాలు, మలేరియా, డెంగ్యూ, మెదడు వాపు, పచ్చకామెర్లు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. పాఠశాల పిల్లల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ప్రారంభించింది. వైద్య బృందం ప్రతి వారం ఆయా పాఠశాలలను సందర్శించి బాలల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తోంది. అనారోగ్యం సమస్యలను గుర్తిస్తే అక్కడిక్కడే చికిత్సలను అందించాలి లేదా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించాలి. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కారణం ఈ పథకంలో వైద్యుల నియామకమే జరగలేదు.
వైద్యుల నియామకం కోసం ప్రకటన జారీ చేసి కౌన్సిలింగ్ నిర్వహించినా ఆశించిన స్థాయిలో వైద్యులు చేరడం లేదు. గ్రామాల్లో పనిచేయడానికి ఆసక్తి లేకపోవడంతో ఈ పథకంలో పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. వ్యాధులు రాకుండా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దీంతో తండాల్లోని పిల్లలు మృత్యువాతపడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో వైద్యులను నియమించి, వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


