గల్ఫ్ దేశాలకు వెళ్ళే వర్కర్ల నమోదు తప్పనిసరి
కాకినాడ, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళే వర్కర్లు భద్రతా కారణాల దృష్ట్యా, జిల్లాలోని సంబంధిత రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ సూచించారు. మంగళవారంనాడు కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పి, ఎం.రవిప్రకాష్‌తో కలిసి గల్ఫ్ బాధితుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గల్ఫ్ , ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళే వర్కర్లు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
వారి సమస్యల పరిష్కారంలో భాగంగా జిల్లాలోని ఆయా ఆర్డిఓల కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక విభాగాలలో నమోదు ద్వారా సంబంధిత వర్కర్లు ఉపాధి అవకాశాలు పరిశీలించడంతో పాటు, వారికి అవసరమైన కౌన్సిలింగ్ కూడా ఇస్తారన్నారు. విదేశాలకు వెళ్ళి అక్కడ పని పరిస్ధితులు సరిలేక ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తల కోసం ఈ నమోదును చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో విదేశాలలో ఉపాధి కల్పించడానికి అనుమతి పొందిన ఏజెంట్లు ఆరుగురు మాత్రమే ఉన్నారని, వీరి ద్వారానే విదేశాలకు విసా ప్రయత్నాలు చేయాలని, అనుమతి లేని నకిలీ ఏజెంట్లను ఆశ్రయించ వద్దని సూచించారు.
విదేశీ ఉపాధి పేరిట వర్కర్లను మోసగించే నకిలీ ఏజెంట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. జిల్లా నుండి ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళే వివిధ వృత్తులలో పని చేసే వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని, గల్ప్దేశాలలో ఉన్న ఆర్ధిక సంక్షోభాల దృష్ట్యా అక్కడపరిస్దితులను తెలుసుకున్న తరువాతే విదేశాలకు వెళ్ళాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆయా పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న విదేశీ బాధితుల కేసుల నమోదును కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని రాజోలు, మల్కీపురం , అమలాపురం వంటి పోలీసు స్టేషన్లలో 10 నుండి 15 కేసులు నమోదవుతునట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా టూరిస్ట్ విసాపై విదేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ పర్మిట్ లేని కారణంగా పని దొరకక బాధలు పడుతున్నారని కూడా వారు వివరించారు. అదే విధంగా గతంలో గల్ఫ్ దేశాలలో పర్యటించి వచ్చిన వారు కూడా డిపెండెంట్ వీసాలను ప్రోత్సహిస్తున్నారని, దీని మూలంగా అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళ వర్క్ పర్మిట్‌ను తప్పని సరిగా పరిశీలించాలని కూడా కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎస్పి ఎం.రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లా నుండి విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని, అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, అనారోగ్యం సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఆ ఫిర్యాదులలో పేర్కొటున్నారని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి విసాలకు పోలీసు క్లీరెన్స్ సర్టిఫికేట్( పిసిసి) విధానాన్ని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి అమలు చేయడం ద్వారా కొంత వరకూ పరిష్కరించవచ్చని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు.
గల్ఫ్ వర్కర్ల కోసం మహారాష్ట్రలో అమలు జరుగుతున్న విధానాన్ని, మన జిల్లా అధికారులతో అధ్యయనం చేయనున్నట్లు యస్పి తెలిపారు. జిల్లాలోని రాజోలు ప్రాంతంలో 5 శాతం ప్రజలు ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్నట్లు విరిలో కొంత మంది వర్క్ పర్మిట్లు లేకుండా వెళ్ళడం మూలంగా అక్కడ సమస్యలు ఎదుర్కొవడం, అదే విధంగా అక్కడ పని విధానాలు నచ్చక ఇబ్బందులు పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు విదేశాలకు వెళ్ళే వర్కర్లు తమ వివరాలు, పని, వెళ్లే దేశం, వారీ సెల్‌నెంబరు నమోదు ద్వారా, అక్కడ సమస్యలు తలెత్తితే వెంటనే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అమలాపురం డియస్పి అంకయ్య, స్పెషల్ బ్రాంచి డియస్పి యస్.అప్పలనాయుడు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


