గాజువాక సమస్యల పరిష్కారానికి చర్యలు
- 95 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ మంగళవారం గాజువాకలో సుడిగాలి పర్యటన జరిపారు. శాసనసభ్యుడు మెరుగుపరచవలసిన రహదారులు, రాజీవ్ క్రీడా ప్రాంగణం, స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన, తుంగ్లాం రహదారులకు సంబంధించిన సమస్యలను కమిషనర్‌కు వివరించారు. కమిషనర్ హరినారాయణన్ స్పందిస్తూ అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి పి.పి.ఆర్లు తయారు చేయాలని కార్యనిర్వాహక ఇంజినీరు శివరామకృష్ణను ఆదేశించారు. 50వ వార్డు వికాస్ నగర్లో రాజీవ్ క్రీడా ప్రాంగణంను మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి రూ. 20 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సరియైన సాంకేతిక సహకారం తీసుకొని, వైర్లు, నిచ్చెన ఏర్పాటు చేయాలని, బయట ఎ.సి. షీట్స్‌తో షెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం స్విమ్మింగ్ పూల్ ప్రాంతాన్ని పరిశీలించి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. మార్కెట్ వద్ద రోడ్డు మార్జిన్స్‌ను క్లియర్ చేసి ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని శాసనసభ్యులు కోరగా అందుకు కమిషనర్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 27 లక్షలతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను కమిషనర్, శాసనసభ్యులు చెరొకటి ప్రారంభించారు. అవసరమైన చోట ప్రజా మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ప్రజలు వినియోగించుకొనేలా చైతన్యవంతం చేయడం ద్వారా ఓడిఎఫ్ నగరంగా విశాఖను రూపొందించాలని పేర్కొన్నారు.
షీలానగర్ వెల్పేర్ సెంటర్ అభివృద్ధికి ప్రతిపాదనలు, రహదారుల అభివృద్ధికి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్లను రూపొందించాలని కోరారు. దశమికొండ రోడ్డు, హైస్కూల్ రోడ్డు, కణితి రోడ్డు, వినాయకనగర్, వడ్లపూడి రైల్వే కాలనీ రోడ్ల సమస్యలను శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు వివరించారు. పర్యటనలో జోనల్ కమిషనర్ బి.వి.రమణ, జివిఎంసి యూనియన్ ప్రతినిధి సుబ్బారావు, ఇఇ శివరామకృష్ణ, ఎ.ఎం.ఓ.హెచ్. డాక్టర్ ఎస్.జయరాం, డిఇ నాగేశ్వరరావు, జోనల్ సిబ్బంది, స్థానిక జన్మభూమి కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నవంబర్ 4 నుంచి పౌరాణిక నాటిక పోటీలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): శ్రీ సాయి శ్రీనివాస కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 4 నుంచి 6 వరకూ మధురవాడ శిల్పారామంలో పౌరాణిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.వి.ఎన్.పాత్రో వెల్లడించారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన నాటక సంస్థలు తమ ప్రదర్శనలు ఇస్తాయన్నారు. కార్యక్రమానికి హజరైన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పోటీలో విజేతలకు ఇచ్చే సింహాద్రి అవార్డు జ్ఞాపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయ్ నిర్మాణ్ కంపెనీ అధ్యక్షులు ఎస్.విజయకుమార్‌తో పాటు సంస్థ ప్రతినిధులు ఎం.సుబ్రహ్మణ్యం, వంకాయల మారుతి ప్రసాద్, పిళ్లా రాంబాబు పాల్గొన్నారు.
డెంగ్యూ జ్వరాలపై విశాఖలో ఇంటింటి సర్వే
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): నగరంలో డెంగ్యూ జ్వరాలపై ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో లేని విధంగా ఈసారి డెంగ్యూ జ్వరాలు అధికంగా నమోదువుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యశాఖ అధికారులతో చర్చలు జరిపి పలు సూచనలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను అప్రమత్తం చేశారు. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం వైద్యులు రంగంలోకి దిగారు. 400 మంది నర్సింగ్ విద్యార్థినుల సహాయంతో ఇంటింటి సర్వే చేపట్టారు. నగరంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం మొదలైంది. ఇళ్లకు వెళ్లే వైద్య బృందాలు జ్వరపీడితులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎన్నిరోజుల నుంచి జ్వరం వస్తున్నదీ, వ్యాధిలక్షణాలు, కేసుల వారీ వివరాలను తెలుసుకుంటున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, డెంగ్యూ జ్వరాలు వస్తే వెంటనే తమను సంప్రదించాలని తెలియచేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జె.సరోజని మంగళవారం ఇక్కడ తెలిపారు. కాగా, పరిశుభ్ర రైల్వేకు ప్రయాణికులు సహకరించాలని స్టేషన్ సూపరింటెండెంట్ పార్థసారథి పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో మాత్రమే వేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. అనంతరం కమర్షియల్ ఇన్స్పెక్టర్ కామేష్ మాట్లాడుతూ స్టేషన్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం స్టేషన్‌ను శుభ్రపరిచారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఏఎస్సై రమణ, సిబ్బంది, టి.టి.ఐ శ్రీలక్ష్మీ, సీబీఎస్‌ఆర్ సత్యనారాయణ, సీటీఐ పాపారావు, టికెట్ కలెక్టర్ సురేష్ పాల్గొన్నారు.


