గిరిజనులకు వైద్యసేవలు అందించడంలో విఫలం
- 93 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 6 (న్యూస్టైమ్): జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన రిమ్స్ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందడం లేదని మానవహక్కుల వేదిక రాష్ట్రకార్యదర్శి భుజంగరావు ఆరోపించారు. ఈ మేరకు మృతి చెందిన కనకసరస్వతి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి ఆయన మాట్లాడారు. రిమ్స్ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసులకు సరైన చికిత్స అందక మృత్యువాత పడుతున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం నార్నూర్ మండలంలోని కనకసరస్వతీ అనే మహిళ ప్రసవం కోసం రిమ్స్ ఆసుపత్రిలో చేరగా సరైన వైద్యం అందక మృతి చెందిందని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు వైద్య సేవల కోసం ఆసుపత్రికి వెళితే వారికి వైద్యం అందించకపోగా వేరే ప్రాంతాలకు వెళ్లాలని సూచించడం దారుణమని అన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ గిరిజనులను ఈ విధంగా వేధించడం సరైన విధానం కాదని అన్నారు. వెంటనే అధికారులు నిరుపేద గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్ ఏర్పాటైనప్పటి నుండి వైద్యం పొందుతూ మృత్యువాత పడ్డారో ఓ నివేదిక తయారుచేసి రాష్ట్రప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. కాగా, కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.మల్లేష్ ఆరోపించారు.
శ్రీరామ్పూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా సమితి సమావేశానికి హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మేకింగ్ ఇండియా అంటూ ప్రధాని మోడీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్నో పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకుంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రం, రాష్ట్రాలు విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలకు న్యాయం జరిగేలా, కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు.


