గురువుకు వందనం: స్పీకర్ కోడెల
గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవవేళ సమాజంలో గురువుకు ఉన్న ఉన్నత స్థానాన్ని మననం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులకు సభాపతి తన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈమేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజాన్ని మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉందని, జన్మనిచ్చిన తల్లి తండ్రుల తరువాత స్థానం గురువులదేనన్నారు.
సమాజం అభివృద్ధి పథంలో పయనించటంలో గురువు పాత్ర ఎంతో కీలకమైనదని సభాపతి స్పష్టం చేసారు. ఒక వ్యక్తి ఉన్నతిలో మంచి గురువు పాత్ర ఎప్పటికీ ఉంటుందన్నారు. భావి భారత పౌరులను తీర్చి దిద్ఢటంలో సర్వోన్నత పాత్ర వారిదేనన్నారు. నవ్యాంద్ర చిన్నారులను నవశకం వైపుకు నడిపించవలసిన సమయము ఆసన్నమైందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత దిశగా రాష్టాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుందని, దానికి ఉపాధ్యాయుల సహకారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను పూజించుకోవటం మనందరి బాధ్యత అని సభాపతి గుర్తు చేసారు.
మరోవైపు వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సభాపతి కోడెల శివప్రసాదరావు. మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే కలుషితమైన, రసాయనాలు కలిగిన ప్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాలను విడనాడి, మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని సభాపతి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ క్రమంలో స్వయంగా సభాపతి సొంత నిధులను వెచ్చించి నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గ వాసులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయించారు.


