గృహనిర్మాణంపై స్పెషల్ డ్రైవ్: మంత్రి యనమల ఆదేశం
- 90 Views
- wadminw
- September 14, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్టైమ్): జిల్లా అన్ని రంగాల్లో ముందంజ వేసేలా వివిధ శాఖల అధికారులు పని చేయాలని, ఆయాశాఖలకు కేటాయించిన నిధులు సత్వర వినియోగం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం నాడు తిమ్మాపురం క్యాంపు కార్యాలయంలో జిల్లాలో వివిధ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ యస్.సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇరిగేషన్ పనులను మంత్రి సమీక్షిస్తూ ఈ పనులు ఆయా సీజన్ల్ బట్టి చేయాలని, వర్షాలు ప్రారంభం కాకముందు పనులు పూర్తిచేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకత అభివృద్థి రేటు, ఖరీఫ్ లక్ష్యాలపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లను అభివృద్థి చేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్థికి ప్రాధన్యత ఇస్తుందన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్థి సంస్థ మహిళా సాధికారత పనులు అమలు చేయాలని, అదే విధంగా యువతలో నైపుణ్యాభివృద్థికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాపిటల్ ఇన్ ప్యూజన్ క్రింద మహిళ సంఘాలకు మరో 2వేలకోట్లు వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యస్సి, యస్టి జాబ్ మేళా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని యనమల తెలిపారు. జిల్లాలో యన్టిఆర్ సుజల స్రవంతి ద్వారా త్రాగు నీటి పధకాలు మరింత మెరుగ్గా పని చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ త్రాగునీటిని ప్రతీ ఇంటికి అందచేసే విధంగా 20 లీటర్ల నీటిని రూ. 5 /-లకు పంపిణీ చేయాలని గ్రామీణ నీటి సరఫర అధికారులు ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనలు ప్రభుత్వామోదం కోసం పంపాలన్నారు.
జిల్లాలో యన్టిఆర్ గ్రామీణ పధకం క్రింద 14,200 గృహాలు గ్రామీణ పధకం క్రింద 4593 గృహాలు మంజూరైయ్యాయని, జిల్లాలో నిర్మాణం చేపట్టడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, దీని కోసం వివిధ శాఖల అధికారుల సేవలను వినియోగించాలన్నారు. అదే విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ పధకం క్రింద మరో 23,340 గృహాలు మంజూరయ్యాయని, ఈ గృహాల నిర్మాణ పనులు తొందరలో మొదలు పెట్టాలన్నారు. పౌరసరఫరాల విభాగం ద్వారా లబ్దిదారులకు నిత్యావసర సరకుల పంపిణీలో ఎటువంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తని నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి. రూ.670 కోట్లతో అభివృధ్ధి పనులు ః జిల్లాలోని తుని నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అమలు చేసి, ఈ నియోకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని ఆర్ధిక మంత్రి యనమల సూచించారు.
తుని నియోజకవర్గ పనులను మంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తూ తుని నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పాటు ఇతర నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని, ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం సుమారు 670 కోట్ల మేర పనులు వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని యనమల తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా 30 చెరువులలో పూడిక తీత పనులు 3.34 కోట్ల తో చేపట్టాలని, మరో రు.2 కోట్ల పనులు వచ్చే డిసంబరులోగా చేపడతారన్నారు. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రు. 21 కోట్లతో రోడ్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు . ఈ పనులు త్వరితగతిన చేపట్టి గ్రామీణ ప్రాంతాలను అభివృధ్ధి చేయాలన్నారు.
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రెగ్యులర్ పనుల కు రు.120 కోట్లు, కత్తిపూడి- పెదమల్లాపురం రోడ్డు వెడల్పునకు రు. 10 కోట్లు కలిపి మొత్తం రు.130 కోట్లతో రోడ్లు అభివృధ్ధి జరుగుతుందన్నారు . తుని నియోజకవర్గంలోని ఆర్ అండ్ బి రోడ్ల అభివృధ్ధికి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ సహకారాన్ని కూడా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. గ్రామీణ విద్యుత్ సరఫరాలో భాగంగా నూతనంగా ఏర్పాటైన కాలనీలలో విద్యుత్ సౌకర్యం కల్పించడం తో బాటు , విద్యుత్ లైన్లు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. గృహ నిర్మాణ పధకం క్రింద తుని నియోజకవర్గానికి యన్టిఆర్ గ్రామీణ ప ధకం క్రింద 900గృహాలు మంజూరయ్యాయని, పట్టణ గృహ నిర్మాణ పధకం క్రింద తుని పట్టణానికి 5090 గృహాలు మంజూరైయ్యాయని మంత్రి యనమల తెలిపారు. తుని పట్టణంలో గృహ నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో అనుమతుల కోసం పట్టణ పేద ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించాలని మున్సిపల్ అధికారలకు మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో తుని నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులు, మహిళా అభివృధ్ధి, శిశు సంక్షేమం, బి.సి.కార్పొరేషన్ , యస్సి కార్పొరేషన్, గ్రామీణ నీటి సరఫర, నిత్యావసర వస్తువులు పంపిణీ నిమిత్తం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో తుని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ యనమల కృష్ణుడు, తుని మున్సిపల్ ఛైర్మన్ ఇ. సత్యన్నారాయణ , తాండవ షుగర్స్ ఛైర్మన్ యస్.లోవరాజు, తుని ఏరియా ఆసుపత్రి కమిటీ ఛైర్మన్ పి.శేషగిరిరావు, మున్సిపల్ కమీషనర్ యస్.వి.రమణ , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


