గృహనిర్మాణాలు జిల్లాకు ఆదర్శం కావాలి: మంత్రి కింజరాపు
- 64 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
శ్రీకాకుళం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): కోటబొమ్మాళిలో రూ. 10 కోట్లతో హుద్‌హుద్ తుపాను బాధితులకు నిర్మిస్తున్న 192 గృహసముదాయాలు జిల్లాకు ఆదర్శం కావాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. జిల్లాలోని కోటబొమ్మాళిలో గల ప్రకాశ్నగర్కాలనీ సమీపంలో నిర్మిస్తున్న గృహాలను మంత్రి పరిశీలించారు. ఇళ్లను త్వరితగతిన నిర్మిస్తుండడం మంచిదేనని, అయితే నాణ్యతలో ఎటువంటి లోపాలుండరాదని మంత్రి గుత్తేదారు ప్రతినిధి వెంకట్‌కు సూచించారు.
ఈ గృహాలు ప్రభుత్వానికి మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకు రావాలన్నారు. కొన్ని బ్లాకులకు నీరు, ఇతరత్రా సమస్యలున్నట్లయితే టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావుకు తెలియచేయాలన్నారు. టెక్కలిలో హుదూద్ గృహాల నిర్మాణాలకు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవోకు సూచించారు. ఏదిఏమైనా గృహనిర్మాణాల లక్ష్యాలకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మంత్రివెంట కోటబొమ్మాళి, సంతబొమ్మాళి సర్పంచులు సింహాద్రి, నారాయణరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.


