గౌతమబుద్దుని సిద్ధాంతాన్ని నమ్మిన సంఘమిత్ర
- 86 Views
- wadminw
- December 21, 2016
- అంతర్జాతీయం
సంఘమిత్ర ప్రస్తావన లేనిదే బౌద్దమత చరిత్రకు అంతం లేదన్నది జరగమెరిగిన సత్యం. అశోక చక్రవర్తి మొదటి భార్య పెద్ద కూతురైన సంఘమిత్ర ఆమె సోదరుడు మహేంద్రుడితో కలిసి బౌద్ధ మత వ్యాప్తికై సన్యాసిగా మారింది. వీరిరువురు అప్పటి శ్రీలంక దేశానికి రాజు, అశోకునికి సమకాలికుడైన దేవనంపియా టిస్సా (సా.పూ 250 – సా.పూ 210) అభ్యర్థన మేరకు బుద్ధుని బోధనలు ఆ దేశంలో వ్యాప్తి చేయడానికి వెళ్ళారు.
ఈమె మొదటగా మతగల్ అనే గ్రామం చేరింది. ఈ గ్రామం హిందూ మహా సముద్ర తీరంలో శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఉన్న జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె తండ్రి అశోక చక్రవర్తి ఆమెను, ఆమెతో పాటు మరికొంతమంది బౌద్ధ సన్యాసినులను అనురాధపురలోని టిస్సా రాణి అనుల, ఇతర సభాసదులను బౌద్ధ మతావలంబకులుగా చేయమని కోరాడు.
అప్పటికే మహేంద్రుడు వారిని బౌద్ధమతంలోకి మార్చి ఉన్నాడు. ఆమె శ్రీలంకలో బౌద్ధ మతం వ్యాప్తి చేసి భిక్కుని సంఘాలనే పేరుతో మహిళల కోసం సన్యాసినుల సాంప్రదాయాన్ని ప్రారంభించింది. కేవలం శ్రీలంకలోనే కాక బర్మా, చైనా, థాయ్లాండ్ మొదలైన దేశాలలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఏర్పడ్డానికి ఈమె కృషి చేసింది.
శ్రీలంకలోని థేరవాద బౌద్ధ మతవాలంబకులు ఈమె బౌద్ధులు పవిత్రంగా భావించే బోధి వృక్షాన్ని శ్రీలంకలోని అనురాధపురలో నాటిన మొదటి రోజును ప్రతి సంవత్సరంలో డిసెంబరు నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఉడువప పోయా లేదా ఉపోసత పోయా అనే పేరుతో పండగ చేసుకుంటారు. సా.పూ 3వ శతాబ్దంలో జీవించిన ప్రముఖ భారతీయ చక్రవర్తి అశోకుడి పుత్రికయైన సంఘమిత్ర, తన తండ్రి ఆదేశం మేరకు సోదరుడు మహేంద్రుడితో కలిసి బౌద్ధ మత వ్యాప్తికి పూనుకున్నది.
అలా శ్రీలంకలోని మహిళలను బౌద్ధ మతంలోకి మార్చడమే తన జీవితాశయంగా భావించి అందులో సఫలీకృతురాలు అయింది. అశోకుడు బౌద్ధమతం స్వీకరించిన తర్వాత దాన్ని ఇరుగుపొరుగున ఉన్న 9 దేశాలల్లో వ్యాప్తి చేయడానికి సంకల్పించాడు. అశోకుడితో సత్సంబంధాలు కలిగిన అప్పటి శ్రీలంక పరిపాలకుడు దేవనాంపియ టిస్సా కాలంలో అనురాధపురలో బౌద్ధ మత వ్యాప్తికి బీజం పడింది.
అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికై చుట్టు పక్కల రాజ్యాలకు తన బృందాలను పంపకముందు ప్రముఖ బౌద్ధ గురువు మొగ్గలీపుత్త టిస్సా సలహాతో వెయ్యిమంది అర్హతులుతో మూడవ బౌద్ధ మహసభలను ఏర్పాటు చేశాడు. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం అవాంఛనీయమైన బౌద్ధ సంఘాలను నిర్మూలన, హిందూమతానికి చెందిన బ్రాహ్మణుల నుండి ఎదురౌతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ బౌద్ధ మత వ్యాప్తిని కొనసాగించాడానికి మార్గాలు అన్వేషించడం.
మొగ్గలీపుత్త అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో బౌద్ధ దర్మాన్ని వ్యాప్తి చేయడానికి 9 బృందాలను పంపడానికి నిర్ణయించారు. అశోకుడు అలా తొమ్మిది బృందాలను తొమ్మిది దిక్కులకు పంపించాడు. దక్షిణ దిక్కున ఉన్న శ్రీలంకకు ఆ దేశపు రాజైన టిస్సా అభ్యర్థన మేరకు అశోకుడు తన కుమారుడైన మహేంద్రుని నేతృత్వంలోని ఓ బృందాన్ని పంపించాడు. మహేంద్రునితో పాటు ఇత్తియ, ఉత్తియ, సంబల, బద్ధశాల, సామనేర (మహేంద్రుడి మేనల్లుడు), బంధూకుడు (మహేంద్రునికి సోదరుని వరస) అనే ఆరు మంది అర్హతులు ఉన్నారు.
వీరందరూ కూడా రాజవంశానికి చెందిన వారే. ఇంత ముఖ్యమైన బృందాన్ని శ్రీలంకకు పంపడం వెనుక బౌద్ధమతాన్ని శ్రీలంకలో వ్యాప్తి చేయడం పట్ల అశోకునికి గల ప్రాముఖ్యతను గమనించవచ్చు. సాక్షాత్తూ బుద్ధుడు కూడా ఆయనకు జ్ఞానోదయం కలిగిన ఎనిమిదేళ్ళ తర్వాత శ్రీలంకకు మూడు సార్లు వెళ్ళి బౌద్ధ మత తత్వాన్ని, సూత్రాలను అక్కడికి రాజ రాజన్యులకు బోధించి వచ్చి ఉన్నాడు కాబట్టి దాన్ని మరింత బలోపేతం చేయడానికి అశోకుడు ఇదే మంచి అవకాశంగా భావించాడు.
అంతే కాకుండా బుద్ధుడు తన తదనంతరం అక్కడి వారిని బౌద్ధ ధర్మాన్ని కొనసాగేందుకు వీలుగా బౌద్ధ భిక్కు, భిక్కుని సాంప్రదాయాలను ప్రారంభించి కొన్ని సామాజిక కట్టుబాట్లను కూడా ఏర్పాటు చేసి వచ్చాడు. కానీ టిస్సా రాజు పాలనలో బౌద్ధ మతం క్షీణదశలో ఉండటంతో దాన్ని సముద్ధరించేందుకు భారతదేశం నుంచి వచ్చిన బృందాల ద్వారా ప్రయత్నం చేస్తే బాగుంటుందని భావించాడు.
మహేంద్రుడు అనురాధపురలో అడుగు పెట్టగానే మహారాజు టిస్సా తన తమ్ముడి భార్యయైన అనుల రాకుమారి, 500 మంది మహిళలతో కలిసి మహామేఘ తోటలో స్వాగతం పలికాడు. మహేంద్రు శ్రీలంకలో బౌద్ధాన్ని పరిచయం చేయడానికి వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తయింది. అతను పురుషుల కోసం భిక్కు సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. కానీ మహారాజు, రాణి అనుల ఆమెతో ఉన్న మహిళలు తమ కోసం ప్రత్యేకంగా భిక్కుణి సాంప్రదాయం ప్రారంభిస్తే బాగుంటుందని భావించారు.
కానీ మహేంద్రుడు మాత్రం భిక్కుణి సాంప్రదాయాన్ని ప్రారంభించాలంటే అందుకు ఓ మహిళ అర్హుతురాలు అవసరమనీ తన అశక్తతతను వ్యక్తం చేశాడు. టిస్సా రాజును ఈ పరిస్థితిని తెలియజేస్తూ తనంత ప్రజ్ఞ కలిగిన అతని చెల్లెలు సంఘమిత్రను శ్రీలంకకు పంపవలసిందిగా అశోకుడికి ఒక ఉత్తరం రాయమని చెప్పాడు. అంతే కాకుండా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన బుద్ధగయ లోని భోధి వృక్షం యొక్క కుడివైపు కొమ్మను అక్కడికి తీసుకురావాల్సిందిగా కోరాడు.
శ్రీలంక రాజు ఇందుకు తన మంత్రియైన అరిత్తుడు అందుకు స్వచ్ఛందంగా ముందుకురావడంతో అతన్ని భారతదేశానికి పంపించాడు. అరిత్తుడు తాను భారత్ నుంచి అక్కడికి తిరిగి రాగానే మహేంద్రుడి చేత తనకు సన్యాసం ఇప్పించాలని కూడా మాట తీసుకున్నాడు. రాజు కూడా అందుకు అంగీకరించాడు. సంఘమిత్ర తల్లిదండ్రులు అశోక చక్రవర్తి, అతని మొదటి భార్య దేవి. దేవి బౌద్ధమతాన్ని స్వీకరించి ఉంది. బౌద్ధ గ్రంథాల ప్రకారం ఆమె జన్మ సంవత్సరం సా.పూ 285. ఆమె అశోకుని దంపతులకు రెండో సంతానం.
ఆమె అన్న మహేంద్రుడు కూడా బౌద్ధ సన్యాసియై శ్రీలంక వెళ్ళాడు. ఆమె ఉజ్జయిని నగరం (ప్రస్తుతం మధ్య ప్రదేశ్లో ఉంది)లో జన్మించింది. అశోకుడు చక్రవర్తి అయ్యేనాటికి ఆమె ఇంకా ఆయన దగ్గరకు వెళ్ళలేదు. తల్లి బౌద్ధురాలు కావడంతో అన్న చెల్లెళ్ళిద్దరూ బౌద్ధాన్ని స్వీకరించారు. ఆమెకు 14 సంవత్సరాల వయసులో ఉండగా అశోకుని బంధువైన అగ్గిబ్రహ్మ అనే అర్హతునితో వివాహం జరిగింది.
వారికి సామనేర సుమన అనే కుమారుడు కలిగాడు. అతను కూడా అర్హతుడై మేనమామ మహేంద్రుడితో కలిసి శ్రీలంక వెళ్ళాడు. సంఘమిత్రకు గురువు ఆయుపాలుడు. 18 సంవత్సరాల వయసులో ఆమె ధమ్మపాలుడి దగ్గర థేరవాద బౌద్ధాన్ని అనుసరించి సన్యాసం తీసుకున్నది. ఆమె సోదరుడు కూడా అప్పుడే సన్యాసం తీసుకున్నాడు. బౌద్ధ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ క్రమంగా థేరవాద బౌద్ధంలో సాధికారత సంపాదించి అర్హతురాలిగా మారింది. పాటలీ పుత్రంలో నివసించేది. ఈ ప్రదేశం ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఉంది.


