గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఏయూ వీసీ
- 95 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): విద్యార్థులు నిత్యం తరగతులకు హాజరవుతూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఉదయం ఏయూ డాక్టర్ వి.ఎస్ క్రిష్ణా గ్రంధాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంధాలయం అధికారులతో కలసి పరిశీలించారు. ప్రతీ విభాగాన్ని సందర్శించి ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తరగతులు జరిగే సమయంలో గ్రంధాలయంలో ఉండటం సరికాదన్నారు.
తరగతులు పూర్తయిన తరువాత ఖాళీ సమయాన్ని పూర్తిస్థాయిలో గ్రంధాలయంలో గడపాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకోసం రీడింగ్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాస్త్ర సంబంధ పుస్తకాలను అధ్యయనం చేయడానికి గ్రంధాలయాన్ని, పోటీ పరీక్షలకు సిద్దమవడానికి రీడింగ్ రూమ్‌ను వినియోగించుకోవాలన్నారు. గ్రంధాలయంలో విద్యార్థులకు తమకు సంబంధించిన పుస్తకాలు, మెటీరియల్, వస్తువులు ఉంచరాదన్నారు. నిత్యం గ్రంధాలయాన్ని శుభ్రం చేయాలన్నారు.
ఈ బుక్స్, ఆన్లైన్ జర్నల్స్‌ను అందుబాటులో ఉంచడం ఎంతో అవసరమన్నారు. గ్రంధాలయాన్ని నాక్ పర్యటన సమయంలో రూ 25 లక్షలతో ఆధునీకరించడం జరిగిందని చీఫ్ లైబ్రేరియన్ ఆచార్య సి.శశికళ తెలిపారు. ప్రస్తుతం గ్రంధాలయం 5.1 లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. కాలానుగుణంగా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైల్ యు ఎర్న్ కార్యక్రమంలో విద్యార్థుల సేవలు పొందుతున్నామన్నారు.


