గ్రామాల్లో మౌలిక సదుపాయాలు: ముళ్లపూడి
- 85 Views
- wadminw
- September 21, 2016
- రాష్ట్రీయం
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో 350 కోట్ల రూపాయల వ్యయంతో పల్లెల్లో సిమెంటు రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణపనులు 2017 మార్చిలోగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా ప్రజాపరిషత్తు ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్ధానిక జడ్పి ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎంపిడిఓలు, పంచాయతిరాజ్ ఇంజినీర్లతో ఉపాధిహామీ పధకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జడ్పి పాఠశాలల్లో బెంచీల ఏర్పాటు, తదితర అంశాలపై ఆయన సవిూక్షించారు.
ఈసందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధిహావిూ పధకం క్రింద వ్యవసాయ కార్మికులకు 132 కోట్ల రూపాయలు వేతనాలుగా గత ఆరునెలల్లో అందించడం జరిగిందని వచ్చేమార్చిలోగా మరో 100 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పధకం క్రింద కూలీలకు వేతనాలు చెల్లించేందుకు పనులను అమలు చేస్తున్నామని చెప్పారు.
జాతీయ గ్రావిూణ ఉపాధి హామీ పధకం క్రింద అత్యధిక పనిదినాలు కల్పించడంతో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 170 కోట్ల రూపాయలు మెటీరియాల్ కాంపోనెంట్ క్రింద నిధులు కేటాయిస్తుందని మరో 180 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంటు క్రింద కలిపి మొత్తం 350 కోట్ల రూపాయల వ్యయంతో పల్లెసీమల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బాపిరాజు చెప్పారు.
పల్లెప్రాంతాలలో గత పాలకులు నిర్లక్ష్యం వలన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్లు నిర్మించి పేదలకు మంచి రహదారి వ్యవస్ధను ఏర్పాటుచేస్తామని బాపిరాజు చెప్పారు. గ్రావిూణ ప్రాంతాలలో అండర్ గ్రౌండు డ్రైయినేజీ సదుపాయాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 7 దశాబ్దాలైనా గత పాలకుల నిర్లక్ష్యం వలన పల్లెల్లో ప్రజలకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఇటువంటి స్ధితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రజలకు ఉచితంగా నిధులు అందించి ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి చర్యలు చేపట్టారని చెప్పారు.
జిల్లాలో ప్రతీ ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలనే ఉద్ధేశ్యంతో 1.80 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఇప్పటివరకూ కేవలం 60 వేల మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో డిశంబరు నాటికల్లా నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలిచేలా చూస్తామని బాపిరాజు చెప్పారు. జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రత్యేక చొరవ, కృషితోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత సమన్వయంతో పనిచేస్తే ఇంటింటా వ్యక్తిగతమరుగుదొడ్డి నిర్మాణం అసాధ్యం కాదని శ్రీ బాపిరాజు చెప్పారు.
జిల్లాలోని యంపిడిఓలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇప్పటివరకూ ప్రారంభం కానీ 80 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని బాపిరాజు కోరారు. త్వరలోనే ఏలూరులో జిల్లాకు చెందిన యంపిడిఓలు, ఇంజినీరింగ్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి స్వచ్ఛమైన పరిశుభ్ర పశ్చిమ గోదావరి జిల్లా ఆవిర్భావానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 5 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాపరిషత్తు పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మిస్తామని 25 శాతం దాతలు విరాళంగా ఇస్తే 75 శాతం తాము భరించి ప్రతీ పాఠశాలకు ప్రహరీ గోడలు నిర్మిస్తామని ఆయన చెప్పారు.
జిల్లాపరిషత్తు పరిధిలోని పాఠశాలల్లో ఒకలక్షా 25 వేలమంది విద్యార్ధినీ విద్యార్ధులు చదువుతుండగా అందులో 50 వేలమంది కేవలం నేలపై కూర్చుని విద్యనభ్యసిస్తున్నారని అటువంటి వారందరికీ బెంచీలు సౌకర్యం కల్పించడానికి దాతల సహకారాన్ని తీసుకున్నామని ఆయన చెప్పారు. ఒక్కొక్క విద్యార్ధికోసం 2 వేల 150 రూపాయలు బెంచీ ఏర్పాటుకు వినియోగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అయితే కాంట్రాక్టు వ్యవస్ధ లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా కేవలం 900 రూపాయలకే బెంచీ తయారీకి చర్యలు తీసుకున్నామని దీనివలన ప్రభుత్వానికి ఎంతో సొమ్ము ఆదా అయ్యిందని బాపిరాజు చెప్పారు.
జిల్లాలో జడ్పి పాఠశాలలకు బెంచీల ఏర్పాటుకు 10.65 కోట్ల రూపాయలు ఖర్చుకాగలదని అంచనావేయగా కేవలం 4.50 కోట్ల రూపాయల వ్యయంతో బెంచీల ఏర్పాటుకు తగు ఆదేశాలు జారీచేసామని ఇప్పటికే 35 వేలమంది విద్యార్ధినీ విద్యార్ధులకు బల్లల సౌకర్యం కల్పించామని మార్చినాటికల్లా ప్రతీ ఒక్కరికీ బెంచీ సౌకర్యం కల్పించి తీరతామని బాపిరాజుచెప్పారు. జిల్లాలో ఓయన్జిసి, గైయీళ, ఐటిసి, తదితర సంస్ధలతోపాటు దాతలు కోటిరూపాయలు విరాళంగా ఇచ్చారని మరో కోటీ 50 లక్షల రూపాయల కలిపి పాఠశాలల్లో బెంచీల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. సమావేశంలో జడ్పి సిఇఓ డి. సత్యనారాయణ, యంపిడిఓలు, పంచాయతిరాజ్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.


