గ్రామీణ పథకాల ద్వారా తూ.గో. జిల్లాకు 18793 గృహాలు
కాకినాడ: నూతనంగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జి.ఓ.నెం.103, 104 ప్రకారం జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ద్వారా 14200 గృహాలు, ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ ద్వారా 4593 గృహాలు మొత్తం 18,793 మంజూరైనట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం క్రింద యూనిట్‌కి ఖరీదు రూ. 1.50 లక్షలని, దీనిలో 95వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, రూ. 55 ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తారని తెలిపారు.
ఈ పథకం క్రింద జిల్లాకు మంజూరైన 14,200 గృహాలకు పూర్తిగా గ్రామ ప్రాంతాలలో ఉండే 15 నియోజకవర్గాలకు 900 చొప్పున కేటాయించడం జరిగిందని, అదే విధంగా 50 శాతం కన్నా ఎక్కువ పట్టణ ప్రాంతం ఉన్న నియోజకవర్గాలకు 350 చొప్పున కేటాయించాలన్నారు. ఈ గృహాలలో 17.1 శాతం ఎస్సీలకు, 5.33 శాతం ఎస్టీలకు, 5.98 శాతం మైనరాటీలకు, 71.59 శాతం ఇతరులకు కేటాయిస్తారన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ గ్రామీణ హౌసింగ్ పథకం క్రింద మంజూరైన గృహాల యూనిట్ విలువ రూ.2లక్షలని, దీనిలో 78వేలు కేంద్రప్రభుత్వ సబ్సడీ, 58వేలు రాష్ట్ర ప్రభుత్వ సబ్సడీ, 58వేలు ఉపాధి హామీ పధకం నుండి మరో 3వేలు రాష్ట్ర ప్రభుత్వ అదనపు సబ్సడీగా, 87వేలు రుణంగా అందిస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ గృహాలు ప్రతి మండలానికి 80 చొప్పున కేటాయిస్తారని, దీనిలో 60శాతం ఎస్సీ, ఎస్టీలకు, 5.98 శాతం మైనారీటీలకు కేటాయిస్తారని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. నూతనంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆయా కేటగిరీలకు కేటాయింపులు జరిపాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం జారీచేసిన నూతన ఉత్తర్వులకు అనుగుణంగా ఉండి ఆమోదం పొందిన లబ్థిదారులకు జాబితాను వచ్చే రెండు రోజులలో అందచేయాలని గృహనిర్మాణ సంస్థ ఇ.ఇలకు, డి.ఇలకు కలెక్టర్ ఆదేశించారు.
అదే విధంగా మిగిలిన లబ్థిదారుల జాబితాను సెప్టెంబరు 12లోగా సిద్దం చేయాలన్నారు. ఆదే విధంగా గృహాలు మంజూరైన లబ్థిదారులకు సెప్టెంబరు 15వ తేదీన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత మంజూరు పత్రాలు జారీ చేస్తామన్నారు. ఈ లబ్దిదారుల ఎంపిక లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని, ఈ ఎంపిక పారదర్శకతతో జరగాలన్నారు. ఇందిర ఆశాస్ యోజన పధకం పనులను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ పధకం క్రింద 2015-16 సం.నికి జిల్లాకు 6213 గృహాలు మంజూరయ్యాయని, వీటిలో 5594 పూర్తి కాబడి 90శాతం ఫలితాలతో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. వివిధ దశలలో ఉన్న మిగిలిన 619 గృహాలు నిర్మాణం వేగవరతం చేయాలన్నారు.
అదే విధంగా ఈ పధకం క్రింద గృహాలు మంజూరు పూర్తికాబడిన లబ్థిదారుల వివరాలను జిల్లా వెబ్ సైట్ లో పొందుపరచాలని గృహల నిర్మాణశాఖ పి.డిని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ ఫర్ ఆల్ క్రింద తుని మున్సిపాలిటీకి 5098 గృహాలు మంజూరయ్యాయని, రూ.3.50లక్షల యూనిట్ విలువ కలిగిన ఈ గృహాలకు కేంద్రప్రభుత్వం రూ. 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష, బ్యాంకు లోను రూ.75వేలు లబ్దిదారుని వాటాగా రూ. 25వేలు చెల్లించవలసి ఉంటుందని, ఈ పధకం క్రింద ఇప్పటి వరకు 3255 లబ్థిదారులను ఎంపిక చేసారన్నారు. ఈ పధకం క్రింద మిగిలిన గృహాలను కాకినాడ నగరానికి మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.
యన్.టి.ఆర్ అప్ గ్రేడేషన్ క్రింద 17000 గృహాలకు మరమత్తులుః- జిల్లాలో 1904 నుండి 2004 మధ్య కాలంలో నిర్మించిన గృహాల మరమ్మత్తులకు గృహానికి 10 వేలు చొప్పున 17000 గృహాలకు నిధులు మంజూరయ్యాయని కలక్టర్ తెలిపారు. ఈ గృహాలకు పై కప్పు మరమ్మత్తులు, డోర్లు, తలుపులు మరమ్మత్తులు గోడలకు ప్లాస్టింగ్ వంటి పనులకు 10 వేలు చొప్పున ఇస్తారన్నారు. జిల్లాలో లింటల్ లెవెల్ మరియు రూఫ్ లెవెల్ స్ధాయిలో ఉన్న 12,588 గృహాలలో 5097 గృహాలు పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 2792 గృహాలు వివిధ కారణాల మూలంగా అనర్హులుగా తేల్చారని కలక్టర్ తెలిపారు.
ఈ గృహాల విషయంలో పూర్తిగా పరిశీలన జరిపి , అనర్హత కారణాలను లబ్దిదారులకు తెలియచేయాలని కలక్టర్ సూచించారు. అదే విధంగా బేస్మెంట్ లెవెల్, బేస్మెంట్ లెవెల్‌కు తక్కువలో ఉన్న 23,589 ఈ గృహాలలో పరిశీలన అనంతం 14,424 గృహాలు అర్హులుగా పేర్కొన్నారని , ఈ గృహాలను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నారని కలక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి డి.సెల్వారాజ్, డిఇలు కె.ఆదిసుబ్రహ్మణ్యం, బి.యస్.శ్రీనివాస్, సుధాకర్ పట్నాయక్, డిప్యూటీ ఇఇలు , ఎఇలు పాల్గొన్నారు.


