ఘనంగా వినాయక చవితి సంబరాలు
- 107 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పలు వార్డులు, చౌరస్తాల్లో భక్తి శ్రద్ధలతో గణనాథుల ప్రతిమలను ప్రతిష్ఠాపించారు. ఎస్పీఎం గేట్ ఎదుట ప్రతిష్ఠాపించిన వినాయకుడి వద్ద సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఐదు వందల మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. మరోవైపు, తీజ్ ఉత్సవాలను గిరిజనులు కనుల పండువగా జరుపుకొన్నారు. కౌట్ల(బి)లోని శాంతినగర్ కాలనీ, రాంసింగ్తాండ గ్రామాల్లోని గిరిజన మహిళలు, యువతులు తీజ్పండగను నిర్వహించారు. కృష్ణాష్టమికి తొమ్మిది రోజుల ముందు నుంచి పొలాల అమావాస్య తదుపరి రోజు వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
పెళ్లిడుకొచ్చిన యువతులు 9 రోజుల పాటు గోధుమలను రెండు పూటల పూజిస్తూ నీళ్లుపోసి నారు పెంచారు. ఆయా గ్రామాల్లోని యువతులందరూ గోధుమ నారు బుట్టలతో స్థానిక ఆలయాలకు సామూహిక ప్రదర్శనగా వెళ్లారు. బాజాభజంత్రీల నడుమ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో వాటిని నిమజ్జనం చేశారు. ఈ ఉత్సవాల్లో తెరాస నాయకులు దత్తురాం, మాయరాం, బద్రినాథ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగ లింగారెడ్డి, దావోజీనాయక్, మాజీ సర్పంచి సీతారాం, ఆయా గ్రామాల మహిళలు, యువతులు పాల్గొన్నారు.


