ఘనంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర
- 115 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం స్థానికం
నెల్లూరు, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): వెంకటగిరి పోలేరమ్మ జాతర కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన భక్తులు కిటకిటలాడారు. సంప్రదాయం ప్రకారం పోలేరమ్మ ప్రతిమను మట్టితో తయారు చేసి వివిధ రకాల పూలతో అలంకిస్తారు. విశేషమేమిటంటే విదేశాల నుండి తెప్పించి రోజా, మల్లె, చామంతి, సన్నజాజులు, బంతి, ముగ్దమందారాలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూల దండలతో శోభాయమనంగా అలంకరిస్తారు. ఈ విదేశాల నుండి తెప్పించిన పూలను శ్రీవేంకటేశ్వరస్వామికి పుష్పగాయంలోనే వినియోగిస్తారు. జాతరకు పెద్ద ఎత్తున ఆదరణ పెరగడంతో ఆలయ పాలక మండలి ఖర్చులకు వెరవకుండా ఖర్చు చేస్తున్నారు. ముందుగా అమ్మవారికి ఎమ్మెల్యే రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహించారు.
జాతర అత్యంత కీలకమైన జంతు బలులు యథేచ్చగా కొనసాగాయి. నిబంధన ప్రకారం జంతు బలులు, మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేదించింది. అయితే జంతు బలులు దశాబ్దాల తరబడి అనువన్సికంగా వస్తుండడంతో ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా యథేచ్చగా బలులు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో పోలేరుమ్మకు అత్యంత కీలకమైన ఎనుబోతును బలి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.దీనిని నిరోధించేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో రెప్పపాటులో ముగించి, ఎనుబోతును వధించిన వ్యక్తి అదే కత్తితో డబ్బు వాయిద్యాల మధ్య పట్టణమంత కలియ తిరుగుతాడు. అనంతరం లక్ష కోడ్లు, వేల సంఖ్యలో పొట్టెళ్లు అమ్మవారి బలిగా సమర్పిస్తారు. శుక్రవారం పోలేరమ్మ మట్టి విగ్రహాన్ని నగర వీధుల్లో ఊరేగించి చెరువులో నిమజ్జనం చేస్తారు.
ఈ ఒక్క రోజున వెంకగిరి రాజ కుటుంబలోని మహిళలు కోటపైకి వచ్చి ప్రజలకు కనిపిస్తారు. సంవత్సరం పొడవున మహిళలు ఎవరికి కనపడకుండా కోటలోనే గడుపుతారు. కాగా, నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో శ్రీవళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంతోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కల్యాణం అనంతరం స్వామి ఆమ్మవారి ఉత్సవ మూర్తులు గ్రామ వీధుల్లో వూరేగుతుంటే స్వామివారి రథం లాగుతూ ఇంటివద్ద కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి, అమ్మవార్ల రథానికి ముందు గ్రామ పెద్దలు రంగునీళ్లు చల్లుకుంటూ రంగులు పూసుకుని ఆనందంగా గ్రామ వీధుల్లో వూరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి ఆలయంలో విభూది అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.
దోమలపై దండయాత్ర: కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. ఆత్మకూరు రవితేజ కల్యాణ మండలంలో ఆత్మకూరు డివిజన్ స్థాయి ఆత్మగౌరవం సదస్సు నిర్వహించారు. ఆత్మగౌరవం కార్యక్రమం విజయవంతం చేసి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకొన్న గ్రామాల సర్పంచులకు, అధికారులకు, నాయకులకు ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంటువ్యాధులు ప్రబలకుండా దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఇందులో చైతన్య ర్యాలీలు, జ్వరాలు, లార్వాల సర్వేలు, జ్వరాలు సోకిన ప్రాంతాల్లో రక్త పరీక్షలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా జ్వరాలు ఉంటే అప్రమత్తం చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబరు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జ్వరాలు, పారిశుద్ధ్య సమస్యలపై 18004252499 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఆర్ఎంపీలు, పీఎంపీలు కొద్దిపాటి జ్వరాలకే డెంగీ అంటూ రోగిని ఆందోళనకు గురిచేసే పరిస్థితి లేకుండా చేస్తామన్నారు. జ్వరం వచ్చిన ప్రాంతాల్లోని బాధితుల రక్త నమూనాలు పరీక్షించి జాగ్రత్తలు తీసుకొంటామని తెలిపారు. ప్రాణనష్టం లేకుండా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆత్మగౌరవం 25 శాతం పూర్తయిందని తెలిపారు. అందుకు ఐదు నెలలు పట్టిందని తెలిపారు. వచ్చే మార్చిలోపు నూరుశాతం సాధించేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. నూతనంగా ఎంపిక చేసిన ఆత్మగౌరవ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని సూచించారు. లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు చేసేలా నిధులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆత్మగౌరవం సాధించిన గ్రామాల్లో అందుకు కృషి చేసిన అధికారులు, సర్పంచులు, నాయకులకు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో రామిరెడ్డి, ఆర్డీవో వెంకటరమణ, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్ఈ, ఆత్మగౌరవం సమన్వయకర్త సుస్మితారెడ్డి, ఇతర అధికారులు మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్లో 31 పంచాయతీలు, జిల్లాలో 144 పంచాయతీలు అత్మగౌరవం లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలాఖరుకు ఆత్మకూరు డివిజన్లో మరో 15 ఈ జాబితాలో చేరుతాయన్నారు. డ్వామా పీడీ హరిత, ఏపీడీ మృదుల, ఆత్మకూరు ఎంపీపీ సుష్మ, ఆత్మకూరు ఛైర్పర్సన్ రాగి వనమ్మ, ఇతర అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
అత్యంత రసహ్యంగా బాంబు ఘటనపై పరిశోధన
నెల్లూరు, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): రెండు వారాల క్రితం జిల్లా కోర్టులో ఉగ్రవాదులు బాంబు పేల్చినట్టు భావిస్తుండగా ఇప్పటికి జాతీయ స్థాయిలో నిఘా సంస్థలు, ప్రత్యేక నిఘా సంస్థలు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నుంచి వచ్చి విచారణ చేపట్టారు. ఈ కేసును వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని నిఘా సంస్థలు అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్నాయి. దీనిపై మీడియా దృష్టిని తప్పించడంతో పోలీసులు ఎవరికి తెలియకుండా ప్రజలలో కలిసిపోయి దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. ఇదిలా ఉండగా బాంబు తయారీకి వాడిన పదార్ధల గురించి పూర్తి సమాచారం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్టు తెలుస్తోంది. ఇందులో అమోనియం నైట్రేట్, లేదా పోటాషియం నైట్రేట్‌ను బాంబులో వాడినట్టు సమాచారం. ఇదిలావుండగా, సొంత వదినపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు సీఐ ఎస్కే ఖాజావళి తెలిపారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతసాగరం మండలం పడమటి కంభంపాడుకు చెందిన పెరుమాళ్ల పెద్ద వెంకటమ్మ, ఆమె మరిది మస్తానయ్య మధ్య ప్రహరీ సరిహద్దు వివాదం కొంత కాలంగా ఉంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రహరీ నిర్మాణం చేయిస్తున్న పెద వెంకటమ్మపై కత్తితో మస్తానయ్య హత్యాయత్నం చేశాడు. ఆమె చేయి అడ్డుపెట్టడంతో అర చేయి వరకు తెగి పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితుడు మస్తానయ్య పరారీలో ఉన్నాడు. సోమశిల ఎస్ఐ ఖాజీబాబు నిందితుడుపై నిఘా ఉంచి గ్రామానికి వెళ్తుండగా అరెస్ట్ చేసి ఆత్మకూరుకు తరలించారు. కాగా, ఎలాంటి పత్రాలు లేకుండా తిరుగుతున్న పలు వాహనాలపై రవాణా అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీబొమ్మ సెంటర్, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ కాని, లైసెన్స్ లేకుండా తిరుగుతున్న 55 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి వారికి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో మోటారు వాహనాల అధికారులు బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, ఏఎంవీఐలు ప్రభాకర్, భాస్కర్, సిబ్బంది మురళీ పాల్గొన్నారు.


