చంద్రబాబును విమర్శించే హక్కు లక్ష్మీపార్వతికి లేదు: అరుణ
గుంటూరు: రాష్ట్రాభివృద్ధి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లక్ష్మీపార్వతికి ఏమాత్రం లేదని మాజీమంత్రి శనక్కాయల అరుణ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లక్ష్మీపార్వతి ఐరన్‌లెగ్ అన్నారు. ఆమె ఎక్కడ కాలుపెడితే అక్కడ భస్మమేనన్నారు. భర్తను ఉండగానే ఆయనను వదిలేసి వచ్చి ఎన్టీఆర్ దగ్గరకు చేరి టిడిపిలో గ్రూపులను పెంచిపోషించేందుకు ప్రధాన కారణమయ్యారని ఆరోపించారు.
ఇప్పుడు ఆమె జగన్ చెంతచేరి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గడిలోపెట్టి అభివృద్ధిపథంలో పయనింపజేస్తున్న చంద్రబాబు పేరెత్తే అర్హత కూడా ఆమెకు లేదన్నారు. జగన్ రెయిన్గన్లపై అవగాహన పెంచుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రధాన కార్యదర్శి షేక్ లాల్‌వజీర్ మాట్లాడుతూ, మైనారిటీ సంక్షేమంలో చంద్రబాబు చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు సింగంశెట్టి వీరయ్య, కె.హనుమంతరావు, మన్నవ కోటేశ్వరరావు, చంద్రగిరి ఏడుకొండలు, సైదావలి, ఉమాదేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


