చంద్రబాబు ముందస్తు వ్యూహం!
విజయవాడ, సెప్టెంబర్ 14 (న్యూస్‌టైమ్): పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టుగా తయారైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి. విభజన సందర్భంగా ఎవరూ పట్టించుకోని ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరిన పాపానికి ఆయన ఇప్పుడు దోషిగా బోనులో నిలబడవలసి వచ్చింది. ఆయన ఆ రోజు ఆ డిమాండ్ చేసి ఉండకపోతే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయం లభించి ఉండేది కాదు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు కేంద్రంలో ఏపీ గురించి ఆలోచించి, ఏదో చేయాలని తపన పడుతున్నది వెంకయ్యనాయుడు ఒక్కరే.
కానీ ఆయనే ఇప్పుడు అందరికి టార్గెట్ అయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి అయితే యాంటీ ప్రత్యేక హోదా స్టాండు తీసుకుని దాని మీద నిలబడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే రకరకాల మాటలు మార్చిన ఆ పార్టీ ప్రస్తుతానికి అయితే ప్రత్యేక హోదా వల్ల వచ్చేదేమీ లేదు, అందుకే తాము కేంద్రం ఇస్తున్న ప్యాకేజీతో సంతృప్తి పడుతున్నాం అనే మాట వినిపిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలేమిటో తనకు చెప్పాలని అయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు.
అయినా హోదా మాత్రమే కావాలని యాగీ చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. రాజకీయ పార్టీలు వాటి ప్రయోజనాల కోసం వాటి ఆట అవి అడతాయి. ప్రజలు మాత్రం ఆ మాయలో చిక్కుకోకుండా ఉంటేనే మేలు. అయితే చంద్రబాబు మొన్నీమధ్య కాలంలో రక్తం మరిగిపోతుంది అనే ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కేంద్రంపై మండి పడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం పూరిత వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నుంచి తన పార్టీ బయటకు వచ్చేస్తుంది జాగ్రత అని హెచ్చిరించారు? ఇప్పటి వరకూ చూస్తే ఒక్క ప్రత్యేక హోదా అనే అంశం గురించినే బోలెడు మాటలు మార్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు ప్రత్యేకహోదా తో అద్బుతాలు జరుగుతాయని, ఎన్నికలయ్యాకా ప్రత్యేక హోదా సంజీవని కాదు అని ఒకసారి, ఇటీవలేమో రక్తం మరిగిపోతుంది అనే డైలాగు వేసింది.
ఈ విధంగా పరస్పర విరుద్దమైన మాటలు స్వయంగా టీడీపీ నేత నోటి నుంచే జాలు వారాయి. రెండేళ్లలోనే ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఒకసారి, ఆ తరువాత వ్యతిరేకంగా మళ్లీ మరోసారి, ఆ తరువాత మళ్లీ అనుకూలంగా మాట్లాడి చివరకు ప్రత్యేక హోదా తో ఏమీ రాదు అనే, దాని వల్ల ప్రయోజనం లేదు. అనే స్టాండ్ మీదకొచ్చింది టీడీపీ. మొత్తంమీద టీడీపీ వైఖరి ఎలా ఉందంటే ప్రత్యేక హోదా అంటేనే, పళ్లు రాలగొడతాం అనే తీరున ఉంది. మరి రెండేళ్లలో ఇన్ని మాటలు అయ్యాయి. మరి వచ్చే మూడేళ్లలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది?
అనేది సగటు మనిషి ఊహకందని విషయం. తెలుగుదేశం పార్టీ నిజంగానే ప్రత్యేకహోదా అంశంపై ఇప్పుడు వ్యక్తపరుస్తున్న అభిప్రాయానికే స్టిక్ ఆన్ అయి ఉంటుంది అంటే అది నమ్మే విషయంలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో పంచుకోవడానికి, కేసుల టెన్షన్ లేకుండా చేసుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకహోదా విషయంలో సంతృప్తి అనే వైఖరిని వ్యక్తం చేస్తోంది. మరి రేపు ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది పరిశీలకుల అంచనాలు వేస్తున్నారు! తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు నాగరికత నేర్పింది మేమేనని జబ్బలు చరచుకున్న ఏపీ నాయకులు ఇప్పుడు ఏమాంటారో చూడాలి మరి.
ఏదిఏమైనా ఏపీ ఇప్పుడు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ నాలుగు రోడ్ల కూడలిలో నిలబడింది. వాస్తవ పరిస్థితులను గుర్తించి ఆలోచించి వ్యవహారిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. కాదూ కాకూడదంటూ హోదా మాత్రమే కావాలని మంకుపట్టుపడితే వచ్చేది కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్రం వైఖరిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు రేపటి ఎన్నికల సమయానికి, బీజేపీ అన్యాయం చేసింది అని అంటారని కొంత మంది బెట్ కాయడానికి రెడీగా ఉన్నారు. మూడేళ్లు గడిచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే పరిస్థితిల్లో ఎన్నికలు జరిగిన పక్షంలో తన మనుగడ కోసం తెలుగుదేశం ఆధినేత బీజేపీ అన్యాయం చేసింది.
ప్రత్యేక హోదా ఇవ్వలేదు నిధుల విషయంలో కూడా అన్యాయం జరిగింది అని వాదించగలడు అనేది వీరి అంచనా. ఎన్నికల నాటికి పెల్లుబికే ప్రభుత్వ వ్యతిరేకతను డైల్యూట్ చేయడానికి బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఈ ఐదేళ్ల ఫెయిల్యూర్‌కి అంతా కారణం కమలనాథులే, ఎంతో సర్దుకుపోయినా న్యాయం చేయలేదు, రెక్కలు విరగొట్టారు అని బాబు వాదిస్తాడని, బీజేపీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగింది అక్కడికీ, తను ఎంతో చేశాను, ఎంతో కష్టపడ్డాను అంటూ అప్పటికి బాబు ఆ వాదనతో, ఆ విధంగా జనం ముందుకు పోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైరం మంచిది కాదు అని ఇన్ని రోజులూ సర్దుకుపోయాను ఇక రాజీ పడే ప్రసక్తే లేదు, అని బాబు 2019 ఎన్నికల నాటికి వాదించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మోడీపై ఎవరికైనా భ్రమలు ఉంటే అవి అప్పటికి పూర్తిగా తొలగిపోతాయి. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ మీదకు మళ్లించాలనే వ్యూహంతో పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని బాబు ఎన్నికల నాడు అలా బరిలోకి దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే తాజాగా చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, స్వాగతాలు రేపు అవసరం వస్తే 2019 ఎన్నికల వ్యూహంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికైతే అభివృద్ధే మంత్రంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబునాయుడు సర్కారు త్వరలో మంత్రివర్గ విస్తరణచేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. అవసరార్ధం కేంద్రాన్నివాడుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తోంది. రానున్న రెండున్నరేళ్లలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకోవడంతో పాటు ప్రస్తుతం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల సమస్య లేకుండా చూడాలన్నది చంద్రబాబు లక్ష్యంగా నేతలు భావిస్తున్నారు.


