చెత్తకుండిలో బాంబు కలకలం
- 71 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కరీంనగర్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో ఓ చెత్తకుండిలో బాంబు ఉన్నట్లు మున్సిపల్ కార్మికులు గుర్తించారు. మంగళవారంనాడు చెత్తకుండి వద్ద గల చెత్తను తొలగిస్తుండగా చెత్తలో రెండు బాంబులు ఉన్నట్లు వారు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. సీపీ మహేందర్‌రెడ్డి బలగాలతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు బాంబులను బయటకు తీసి పరిశీలించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకే కొందరు వ్యక్తులు ఈ పనికి పూనుకున్నారని అన్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో ఆ ప్రాంతమంతా పరిశీలన జరిపినట్లు తెలిపారు.
దొరికిన రెండు బాంబులను పరీక్ష నిమిత్తం పంపినట్లు తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. జ్యోతినగర్‌లో ఓ పాఠశాల మైదానంలో శిక్షణ కోసం ఉపయోగించే రెండు గ్రెనేడ్ బాంబులు మంగళవారం ఉదయం లభ్యమయ్యాయి. నగరపాలక సంస్థకు చెందిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు జ్యోతినగర్‌లోని పాఠశాల మైదానంలో చెత్త తొలగిస్తుండగా రెండు గ్రెనేడ్ బాంబులు కనిపించాయి. దీంతో పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ అధికారులకు సమాచార మందించారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి గ్రెనేడ్ బాంబులుగా గుర్తించారు. రెండవ పట్టణ సీఐ హరిప్రసాద్ మైదానానికి చేరుకుని గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
వాటిని పోలీసుస్టేషన్‌కు తరలించగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్ పరిశీలించారు. ఆ బాంబులను శిక్షణలో ఉపయోగిస్తారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. మరోవైపు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. మంగళవారం వేకువజామున నుంచి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లిల్లూ సోదా జరిపారు. ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 20 బైకులు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా క్వింటాలు సీజ్ చేశారు. సోదాల్లో ఏసీపీ రామారావు, సీఐలు హరిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై ఎబీవీపీ ధర్నా
కరీంనగర్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలతో పాటు హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ఎబివిపి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగబోవన్న ముఖ్యమంత్రి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేలా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా వాస్తుదేషాలంటూ ప్రభుత్వ కార్యాలయాలను నేలకూల్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. మరోవైపు, దళితులపై దాడులు నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, గిరిజనులు, మైనార్టీల ఆహారపు అలవాట్లు, జీవన విధానంపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. గోరక్షణ పేరిట దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గోరక్షక గుండాలను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు డి.నరేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, రమేశ్, టి.మధు, శ్రావణ్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: శ్రీధర్‌బాబు
కరీంనగర్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అప్రతిష్టపాలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా తమపై విమర్శలు చేసి తమను లోబర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారిని గుర్తించామని, 2013జీవో ప్రకారం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే తాము చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేసి రైతులకు నీటిని అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా వ్యక్తిగతంగా పార్టీని అప్రతిష్టపాలు చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. జిల్లాలో వరద కాల్వ, ఎల్లంపల్లి ప్రాజెక్టు, నిడమానేరు ప్రాజెక్టులు పనులు పదిశాతం ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయని, ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ప్రాజెక్టులను చేపట్టకుండా గత ప్రభుత్వాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు సకాలంలో రుణాలు అందించే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.


