చెత్తలను వేరు చేయడానికి బల్దియా వినూత్న యత్నాలు
- 86 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటి నుండి తడి పొడి చెత్తలను వేర్వేరుగా చేయడానికి గృహిణులకు బొట్టు, తిలకం పెట్టడం, స్వయం సహాయక మహిళలు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించడం తదితర వినూత్న కార్యక్రమాలను జిహెచ్ఎంసి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు బుధవారం చేపట్టారు. దేశంలో మరే మున్సిపల్ కార్పొరేషన్లో లేని విధంగా హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్బిన్ల చొప్పున 44 లక్షల డిస్ట్బిన్లను జిహెచ్ఎంసి అందజేసింది.
ఈ డస్ట్‌బిన్ ద్వారా తడి, పొడి చెత్లను వేర్వేరుగా వేయడానికి పెద్దఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇది పాక్షికంగానే జరుగుతోంది. అయితే తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం కేవలం పాశ్చత్య దేశాలలోని నగరాల్లోనే జరుగుతోంది. భారతదేశంలోని ఏ నగరంలోనూ చెత్తను వేర్వేరుగా సేకరించే విధానం అమలు జరగలేదు. కేంద్రప్రభుత్వం రూపొందించిన ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2016ను పటిష్టంగా అమలు చేయడానికి జిహెచ్ఎంసి నిర్ణయించింది.
దీనిలో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయడం, పరిసరాల పరిశుభ్రత, గార్బెజ్ పాయింట్లను తొలగించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల తొలగింపులో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు ఐదు లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక బృందాల మహిళలు, 10 లక్షలకు పైగా ఉన్న పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల సహకారాలను పొందడానికి డిసెంబర్ 12 నుండి జనవరి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.
దీనిలో భాగంగా బుధవారంనాడు నగరంలోని వివిధ కాలనీల్లో ఇంటికి వెళ్లి గృహిణీలు, ఇళ్లలో పనిచేసే వాళ్లకు తడి, పొడి చెత్తను ఆకుపచ్చ, నీలరంగు డబ్బాల్లో వేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలిసి చెప్పారు. ప్రధానంగా ఈ విషయాన్ని గృహిణులకు బొట్టు, తిలకం పెట్టి స్వయం సహాయక మహిళలు, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.


