చేనేతకు మరింత ప్రోత్సాహం: డీపీఆర్వో ఫ్రాన్సిస్
- 113 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 3 (న్యూస్టైమ్): తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ టి.టి.డి కళ్యాణమండపంలో 9రోజుల పాటు జరగనున్న కో-ఆప్టెక్స్ వస్త్రప్రదర్శనను జిల్లా పౌరసంబందాధికారి ఎం.ఫ్రాన్సిస్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కో-ఆప్టెక్స్ ఎగ్జిబిషన్లో నాణ్యత కలిగిన వస్త్రాలు లభిస్తాయని, నూతనంగా కంప్యూటరైజ్డ్ డిజైన్స్ తో తయారు చేసిన చేనేత కాంచీపురం, ప్యూర్ సిల్క్ చీరలు సేలం, కోయంబత్తూరు ప్రాంతాలకు చెందిన వస్త్రాలు ఈ ప్రదర్శలో ఏర్పాటు చేశారన్నారు. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా ఆరోగ్యంతో పాటు అహ్లాదంగా ఉంటాయని, అదే విధంగా ఆర్గనిక్ మెటీరియల్తో చేసిన వస్త్రాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారన్నారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా దీని పై ఆధారపడిన చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కో-ఆప్టెక్స్ మార్కెటింగ్ మేనేజర్ వై.యువరాజ్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం ద్వారా కోఆప్టెక్స్ ఉత్పత్తులపై 20 నుండి 30 శాతం రిబేట్ ఈ ప్రదర్శనలో ఇస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ఉంటుందని , ఈ ప్రదర్శనలో కాంచీపురం సిల్క్ శారీలు, ఆర్ని, సాఫ్ట్ శిల్క్,పోన్నామ్, మధురై , చిట్టినాడ్ కాటన్ చీరలు, ఇతర డ్రెస్ మెటీరియల్ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ యువరాజ్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ చంద్రశేఖరన్, ప్రోజెక్ట్ మేనేజర్ డి.మణి, బ్రాంచ్ మేనేజర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


