సినిమా, టీవీ నాటకరంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని సమాచార ముఖ్యకార్యదర్శికి పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.

రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తాను సినిమా, టీవీ నాటక రంగ అభివృద్ధి మండలి సంస్థ చైర్మన్ గా నియమితులయ్యానని అయితే ప్రభుత్వం మారడంతో నైతిక విలువలకు కట్టుబడిరాజీనామా చేసినట్లు తెలిపారు.

అంబికా కృష్ణ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గానూ చంద్రబాబు నాయుడు 2016లో సినిమా, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయన పదవీ కాలం ఇంకా ఏడాదిపాటు ఉంది. అయితే ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఇకపోతే ఇప్పటికే పలువురు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ ఆధీనంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

అలాగే టీటీడీ పాలకమండలిలో నలుగురు సభ్యులు రాజీనామా చేశారు. అలాగే దుర్గగుడికి చెందిన పాలకమండలి సభ్యులలో ఐదుగురు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరితోపాటు మరికొందరు తమ నామినెటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు.