జగమెరగని రచయిత జొన్నలగడ్డ!
జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి… ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేటలో 1906 సంవత్సరంలో మృత్యుంజయుడు, వేంకమాంబ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యాభాసం చేసి తత్త్వశాస్త్రం, చరిత్రలలో ఎం.ఏ. పట్టా పొందారు. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యుడు. ఆయన కొంతకాలం స్వరాజ్య పత్రికలో పనిచేశారు.
1926లో లా పట్టా పొందారు. కొన్నాళ్లు రాజమండ్రి, విశాఖపట్నంలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈయన సంస్కృతాంధ్ర భాషలనే కాక, బెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్ మొదలైన నేర్చుకొని ఆయా భాషల సాహిత్యం గురించి పరిచయం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ భాష ప్రభావం ఈయన రచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈయన భార్య శారదాంబ కూడా విదుషీమణి, రచయిత్రి.
ఈయన 1965 డిసెంబర్ 14న పరమపదించారు. చంద్రగుప్త, మేవాడు పతనము వంటి నాటకాలు, శ్యామల (1920), కాలసర్పి (1922), భిన్నహస్తము (1920), నూర్జహాన్ (1925), దుర్గాదాసు, ఆటీన్ మణెలా (1920), ఒథెల్లో (1960), నాలుగు కథలు (1932) పాంచకడీ దేవ్ రాసిన బెంగాలీ కథలకు తెలుగు అనువాదం, ఆంధ్ర మహా పురుషులు (1936), సాహిత్య తత్త్వ విమర్శనము (1936), విద్యార్థి ప్రకాశిక, ప్రణయ ప్రతిమ (1920) వంటి నవలలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.
ఈయన 1950ల్లో తాను చేసిన మహారాష్ట్ర యాత్రను ఈ గ్రంథంలో యాత్రా సాహిత్యరూపంలో రచించారు. ఈ యాత్రలో భాగంగా శివాజీ, బాజీరావు వంటి మహావీరులకు సంబంధించిన చారిత్రిక ప్రదేశాలు, కోటలు, మహానగరాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించి వాటి గురించి గ్రంథంలో పొందుపరిచారు. కాగా ఈ పుస్తకంలో అత్యంత విలువైన భాగం మాత్రం పీఠికలో ఉన్న యాత్రా సాహిత్య వివరాలు.
క్రీస్తుకు పూర్వమున్న వివిధ నాగరికతల్లో యాత్రా సాహిత్యం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి వరకూ యాత్రా సాహిత్యం రచించిన భ్రమణ కాంక్షాపరుల గురించి ఇందులో వివరించారు. ఈ సమాచారం విజ్ఞానసర్వస్వ దృక్కోణంలో యాత్రా సాహిత్యం తరహా వ్యాసాలకు చాలా విలువైనది. దీని రెండవకూర్పును వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు చెన్నపురిలోని వావిళ్ల ప్రెస్లో 1951 సంవత్సరంలో ముద్రించారు. సంపూర్ణ భక్త విజయం గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి.
మద్రాసులో న్యాయవాది సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు.


