‘జన్మభూమి’తో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
- 83 Views
- wadminw
- January 4, 2017
- Home Slider రాష్ట్రీయం
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నర సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రతీ ఒక్కరిలో సంతోషం వ్యక్తం అవుతోందని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చెప్పారు. స్ధానిక 39వ డివిజన్ శివగోపాల్లునాని నగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈసందర్భంగా శ్రీ మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి 17 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో క్రొత్తరాష్ట్రం ఏర్పడగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ చంద్రబాబునాయుడు ఛాలెంజ్‌గా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. గతరెండున్నర సంవత్సరాల్లో 65 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గత 70 సంవత్సరాలు క్రితం కలగన్న పోలవరం ప్రాజెక్టు కలసాకారం అవుతోందన్నారు.
ఏడాదికాలంలో పట్టిసీమ ఎ త్తిపోతల పధకాన్ని పూర్తి చేసి కృష్ణాడెల్టాకు సాగునీరు అందించడం వలన 2 వేల 500 కోట్ల రూపాయల విలువైన పంట ఉత్పత్తి అయ్యిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. ఈజన్మభూమి కార్యక్రమం ద్వారా క్రొత్తగా రాష్ట్రంలో 4 లక్షల పెన్షన్లు అందిస్తున్నామని వాటిలో 30 వేల పెన్షన్లు మనజిల్లాలో పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1 కోటీ 60 లక్షల కుటుంబాలు రంజాన్, క్రిష్టమస్, సంక్రాంతి పండుగలు ఆనందంతో జరుపుకునేలా చంద్రన్న కానుకలు ఇవ్వడం జరిగిందన్నారు.
నగరంలో ప్రతీ పేదమహిళకూ స్వంత ఇంటికల సాకారం చేసేందుకు శాసనసభ్యులు శ్రీ బడేటి బుజ్జి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. అదేవిధంగా కేవలం ఒక్క 39వ డివిజన్‌లోనే 5 సంవత్సరాల కాలంలో రెండున్నర కోట్ల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామంటే అది ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. డివిజన్లో 40 డ్వాక్రా గ్రూపులకు 16 లక్షల 70 వేల రూపాయలు ఋణమాఫీ చేసామన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్దిదారులు ఆవివరాలను ప్రక్కవారికి కూడా తెలియజేయాలని ఎంపి మాగంటి బాబు చెప్పారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారన్నారు. 760 కోట్ల రూపాయల వ్యయంతో ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక సిద్ధం చేసామని త్వరలో ఈపనులు ప్రారంభించి ఏలూరు నగరాన్ని అన్నీవిధాల అభివృద్ధి చేస్తామన్నారు.
ఏలూరు నగరమేయరు షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ప్రతీ పేద కుటుంబానికి మంచినీటి కుళాయి అందించాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఏలూరు నగరంలో డ్రైయినేజీ, రోడ్డులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గత రెండేళ్లలో అమలు చేసి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని మేయరు నూర్జహాన్ చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పాలి ప్రసాద్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు యస్‌యంఆర్ పెదబాబు, స్ధానిక కార్పోరేటర్ సరిది కృష్ణవేణిబాబి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, మాజీ డిప్యూటి మేయరు చోడే వెంకటరత్నం, కార్పోరేటర్ కోమర్తి వేణుగోపాల్, నగర కమిషనరు వై. సాయి శ్రీకాంత్, మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంక్రాంతి కానుకలను యంపి మాగంటి బాబు పంపిణీ చేసారు.


