జర్నలిస్టుల ప్రమాద బీమా పాలసీదారులకు ముఖ్య గమనిక!
- 71 Views
- wadminw
- November 24, 2016
- రాష్ట్రీయం
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పాలసీ కలిగిన వారందరికీ ఉపయోగపడే సమాచారమిది. మిత్రులు యూనియన్లకు అతీతంగా ఈ సమాచారాన్ని మన మిత్రులందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రమాద బీమా పాలసీ కలిగిన వారు ఆయా పాలసీలను జారీచేసిన నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి క్లయిమ్ ఎలా పొందాలన్నదానిపై చాలా రకాల సందేహాలు ఉన్నప్పటికీ అందులో కీలకమైన సమాచార, పౌర సంబంధాల శాఖ జారీచేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (NOC) బాధ ఇక ఎవరికీ ఉండకూడదన్న కోణంలో ఏపీయూడబ్ల్యూజే చేసిన ప్రయత్నం అందరికీ ఎంతో ఉపయోగకరం.
జర్నలిస్టుల కష్టాలు, సమస్యలు పూర్తిగా అధ్యయనం చేసిన సంఘంగా ఏపీయూడబ్ల్యూజే ఇలాంటి అంశాలపై ముందు నుంచీ అప్రమత్తంగా ఉంటుందనడానికి తాజా NOC ఒక ఉదాహరణ మాత్రమే. మనవంతు ప్రీమియంగా కేవలం 198 రూపాయలు చెల్లించి సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రమాద బీమా పాలసీని పొందిన మిత్రులందరూ ఈ లేఖను తమ పాలసీతో పాటు భద్రపర్చుకుంటే భవిష్యత్తులో క్లయిమ్ దరఖాస్తు సమర్పించినప్పుడు ప్రత్యేకించి NOC సమర్పించాల్సిన అవసరం ఉండదు. మిత్రులకు ఎంతగానో ఉపయోగపడే ఈ సమాచారాన్ని మీమీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇతరత్రా గ్రూపుల్లో పంచుకోవడం ద్వారా అందరికీ సమాచారాన్ని తెలియజేసినట్లవుతుంది.
సమాచార, పౌర సంబంధాల శాఖ జారీచేసిన ఈ నిరభ్యంతర పత్రం నాతో పాటు రాష్ట్రంలోని బీమా సదుపాయం కలిగిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రునికీ ఉపయోగపడనుంది. ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచి అమలు చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల బీమా పథకంలో దాదాపు తొలి క్లైం దరఖాస్తు నాదే కావడంతో ఇన్స్యూరెన్స్ కంపెనీకి రాకూడని అనుమానమే వచ్చింది.
క్లయిమ్ డబ్బులు బీమా పాలసీదారుకు ఇవ్వాలా? లేక పాలసీ కట్టిన సమాచార, పౌర సంబంధాల శాఖకు ఇవ్వాలా? అన్న సందేహం నేపథ్యంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ నుంచి నిరభ్యంతర పత్రాన్ని (ఎన్.ఒ.సి.ని) కోరింది. తమ దృష్టికి వచ్చిన ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీ నల్లి ధర్మారావు, ఐ.వి. సుబ్బారావు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ నాయకులు అంబటి ఆంజనేయులు సంబంధిత సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులతో మాట్లాడి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేలా తగు బీమా కంపెనీకి తగు ఆదేశాలు జారీచేయాలని కోరిన మీదట సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనరేట్‌లో మీడియా రిలేషన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీ సంజీవరెడ్డి గారు తక్షణమే స్పందించి హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డివిజనల్ మేనేజర్‌కు ప్రత్యేకించి లేఖ రాశారు.
ప్రస్తుతానికి నా క్లయిమ్ దరఖాస్తుకు NOC ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ధ్రువీకరణతో నిమిత్తం లేకుండా నేరుగా పాలసీదారులకే క్లయిమ్ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దరఖాస్తు (పాలసీ)దారు సమర్పించిన పత్రాలను పరిశీలించి నేరుగా వారి పేరిటే చెల్లింపులు జరిపి దరఖాస్తుల పరిష్కారంలో అనవసర జాప్యాన్ని నివారించాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని ఏపీయూడబ్ల్యూజే స్వాగతించింది. విషయాన్ని తన దృష్టికి తీసుకురాగానే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపించిన సంజీవరెడ్డి, అదనపు కమిషనర్ తదితరులకు యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది.
మెచ్చుకోవడం కన్నా కూడా… సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.
– పైడి లక్ష్మణరావు,
సభ్యుడు, ఏపీయూడబ్ల్యూజే


