‘జల’ జగడంపై తొలి అడుగు!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పీటముడిగా మారిన జలవివాదాలు పరిష్కారం దిశగా ఢిల్లీలో తొలి అడుగు పడింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం హస్తినలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని జల వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీ అవడం ఇదే తొలిసారి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు.
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి ముందు ఇద్దరు సీఎంలు వేర్వేరుగా కేంద్ర మంత్రి ఉమాభారతిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు. ముందుగా కేంద్ర మంత్రి ఉమాభారతి ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ తరపున ఐదుగురు సభ్యులు మాత్రమే రావాలని మొదట చెప్పినప్పటికీ ఎంపీలు, సెక్రెటరీలు, అధికారులను కూడా ఈ సమావేశానికి అనుమతించారు.
మొత్తానికి సుమారు 40 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, ఈ బసమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర వివాదంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నదీ జలాల పంపకం అంశంలో వివాదాలకు పోకుండా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని ఉమాభారతి సూచించారు.
తాజాగా జరిగిన అపెక్స్ సమావేశంలో నదీ జలాల పంపకంలో వివాదాల పరిష్కారంపై మాత్రమే చర్చించినట్లు చెప్పారు. నీటి లభ్యత ఆధారంగా అంచనా వేసి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీని చేస్తామని, దీనిని ఇరు రాష్ట్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను అంచనా వేసేందుకు కేంద్రం, రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కమిటీ అధ్యయం చేసిన నివేదికను ట్రైబ్యునల్‌కు అందజేస్తుందని, నీటి లభ్యత ఆధారంగా టైబ్యునల్ సూచనల మేరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా, కృష్ణా జలాల పంపిణీలో తలెత్తుతున్న వివాదాలు, ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలను వినిపించారని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. ప్రధానంగా మూడు అంశాలపైనే చర్చ జరిగిందని, వాటిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. మరో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదని ఉమాభారతి వెల్లడించారు.
డిండి, పాలమూరు ప్రాజెక్టులపై ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. గొడవలు పడితే లాభం లేదని, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని, ఇవాళ ఆ దిశగా అడుగులు పడ్డాయని ఆమె అన్నారు. నీటి లభ్యత ఆధారంగా అంచనా వేసి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీ చేస్తామని ఉమాభారతి పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో నీటి లభ్యతను కమిటీ అంచనా వేస్తుందని నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ సూచన మేరకు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, నీటి పంపిణీని ఇరు రాష్ట్రాలు కేంద్ర జలవనరులశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని ఉమాభారతి వెల్లడించారు.
అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ ఏర్పాటుకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయని ఉమాభారతి చెప్పారు. అంతే కాకుండా సీడబ్ల్యుసీ పర్యవేక్షణలో ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రెండు రాష్ట్రాలు కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రల వివాదంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. నదీ జలాల పంపిణీ విషయంలో వివాదాల పరిష్కారం గురించి ఆలోచించామని పేర్కొన్నారు. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు హాజరయ్యారు. అలాగే ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమా, హరీష్‌రావులు కూడా హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది.


