జింగ్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
- 104 Views
- wadminw
- September 5, 2016
- అంతర్జాతీయం
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఆదివారం భేటీ అయ్యారు. చైనాలోని హంగ్‌ఝౌ నగరంలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా జరిగిన వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వం, ఉగ్రవాదంపై చైనా వైఖరి తదితర అంశాలను వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్యానికి చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా జేఈడీ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని వీటో చేసి చైనా భారత్‌కు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు, ఘర్షణాత్మక అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ఇరు దేశాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అన్నారు. భారత్, చైనాల మధ్య ఉన్న పలు ఉద్రిక్త పరిస్థితులు, జరగాల్సిన ఒప్పందాలకు సంబంధించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇరు దేశాల ఆకాంక్షలను పరస్పరం గౌరవించుకోవాలని, సున్నితంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. ఇండియా-చైనాల మధ్య సంబంధం ఒక్క ఇరు దేశాలకే కాకుండా మొత్తం ఆసియానికి, ప్రపంచానికి చాలా ముఖ్యం అని కూడా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడికి చెప్పారు. దీనికి స్పందించిన చైనా అధ్యక్షుడు కూడా తాము తప్పకుండా ఇరు దేశాల మధ్య సంబంధాలను, ఆకాంక్షలను గౌరవిస్తామని బదులిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు, సమస్యలకు కారణమైన ప్రశ్నలకు సమాధానం కనుగొని వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఒకరు ఈ విషయం స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై కలిసి ఉమ్మడి పోరు చేయాలని కూడా మోదీ గట్టిగా చెప్పారు. గత మూడు నెలల్లో చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అవడం ఇది రెండోసారి. మరోవైపు, జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలోని 20 అగ్రరాజ్యాల దేశాధినేతలు హంగ్‌ఝౌ నగరానికి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి చేరుకున్నారు.
సైన్స్ సిటీగా పేరొందిన హంగ్ఝౌలో రెండురోజుల పాటు జీ-20 సదస్సు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం లాంఛనంగా ఈ సదస్సు ప్రారంభమయింది. రాత్రికి దేశాధినేతలకు విందు కార్యక్రమం ఏర్పాటుచేశారు.


