జీఎస్టీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం
- 110 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
‘డిజిటల్ లిటరసీ’కి ప్రోత్సాహకాలు
బాగా పనిచేస్తే స్మార్ట్ ఫోన్లు: సీఎం హామీ
అన్ని ఐటీ ఉత్పత్తులకు పెట్టుబడి రాయితీ
అగ్రి బిజినెస్ ఫైనాన్స్ కంపెనీకి మూల ధనం
జలసంరణ చర్యలఫై విద్యార్ధులకు అవగాహన
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
విజయవాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బాగా పనిచేసి ప్రగతి సాధించే ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. నాబార్డ్ ద్వారా స్థాపించిన అగ్రి బిజినెస్ ఫైనాన్స్ కంపెనీకి రూ.1.16 కోట్లు అదనపు మూలధన నిధికి, న్యూ రోల్ ఆఫ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఏపీటీఎస్ ద్వారా కృషి చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ పాలసీలో సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్ పాలసీలో ఐవోటీ పాలసీ మెర్జ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 25% అన్ని ఐటీ ప్రోడక్స్ట్కు, ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్‌కు 30% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో పీపీపీ పద్ధతిలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వం ద్వారా మినిమం రెంటల్ గ్యారంటీ 6 నెలల నుంచి ఏడాదిలోపు టవర్ల నిర్మాణం, గ్యాస్ దిగుమతి వల్ల అయ్యే ఖర్చును తగ్గించడానికి కాకినాడలో గ్యాస్ స్టోరేజీ కేంద్రం ఏర్పాటు, రూ. 1,010 కోట్లలో రూ.800 కోట్ల రుణాన్ని సేకరించి 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని దీని ద్వారా పరిశ్రమలకు కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు సిటీ గ్యాస్ సరఫరా చేయడంతో పాటు ప్రభుత్వ జల సంరక్షణ కార్యక్రమాల్లో విద్యార్థులు లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్థులకు భాగస్వామ్యం చేయాలని, వనం-మనం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, జల సంరక్షణపై ప్రతి శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి వర్గం తీర్మానించింది.
రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇన్నోవేషన్ సొసైటీలు కళాశాలల్లో ఇన్నోవేషన్ ఛాప్టర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు చురుగ్గా పనిచేసే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, విద్యార్థులతో కలిసి డిజిటల్ లిటరసీ అమలు చేయడం, విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్మార్టు ఫోన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటుగా కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్‌కు స్థలం కేటాయించడంతో పాటు విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం అందాలపల్లిలో పర్యాటక శాఖకు 0.94 ఎకరాలు, పరదేశిపాలెంలో 133 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కోకు రూ.7.26 కోట్లకు 1.90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో సెజ్ విస్తరణ కోసం ఏపీఐఐసీకి 61.63 ఎకరాల భూమి ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టాల్సిన నాలుగు బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది.
తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో వస్తు సేవా పన్నుల (జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టానున్నారు. ఈమేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కర్నూలులో ఇండ్రస్టీయల్ హబ్ కోసం ఏపీఐఐసీకి 7 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీకి కలిపి సుమారు 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ పాలసీ సవరణ, కార్మిక సంస్కరణలు, కాకినాడలో గెయిల్ గ్యాస్ స్టోరేజ్ ఫెసిలిటీని పెంచే ప్రతిపాదనలకు కేబినేట్ అంగీకరించింది.
ఇక ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే వరకు స్పందించకూడదని ఏపీ కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌లో గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. జీఎస్టీ బిల్లు సహా ఎన్జీ రంగా వర్శిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల బిల్లు, రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించే బిల్లు, కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోని వ్యాట్ సవరణ బిల్లులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
వృద్దిరేటుపై వర్షభావ ప్రభావం పడకూడదు!
టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం హితవు
విజయవాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): మొదటి మూడు నెలల్లో జాతీయస్థాయిలో వృద్దిరేటు 7.3శాతం ఉంటే మనరాష్ట్రంలో వృద్దిరేటు 12.26 శాతం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్దిరేటు 22.7శాతం ఉందంటూ, కరవు వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్దిరేటు పడిపోకుండా చూడాలన్నారు. నీరు-ప్రగతిపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్గన్స్కు పంట రక్షణగా నామకరణం చేశారు. పంట సంజీవని, పంట రక్షణలను సమర్ధంగా వినియోగించి, డ్రైస్పెల్స్ను ఎదుర్కొవాలని సూచించారు. ఐదు రోజుల్లో నాలుగు లక్షల ఎకరాలకు రక్షక తడులిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడడం ఒక చరిత్ర అని, మంచి నమూనా అని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ, ఎట్టి పరిస్థితుల్లో పంటలు ఎండిపోరాదన్నదే తన సంకల్పం అన్నారు. బావులు కూడా అనుసంధానం చేయాలని, అన్ని బావులు రీచార్జి అయ్యేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 9.7శాతం వర్షపాతం లోటు ఉందని, అందరికి నీటి భద్రతను ఇవ్వాలంటే జల సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. గాలేరీ-నగరి ప్రాజెక్టుపై నాలుగు రోజుల్లో 140 కిమీ దూరం డ్రోన్ల ద్వారా పరిశీలించిన విషయం ముఖ్యమంత్రి ప్రస్తావించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నింటినీ కూడా డ్రోన్ల ద్వారా పరిశీలించినట్లు తెలిపారు. కాలువల్లో తుంగ, కట్టలపై కంపచెట్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. నీటి ప్రవహానికి అవరోధాలు లేకుండా చూడాలన్నారు. రాబోయే రెండునెలల్లో హంద్రీ-నీవాను మడకశిర వరకు తీసుకువెళ్తామన్నారు. నీరు- ప్రగతి కార్యక్రమంపై ప్రతి ప్రజాప్రతినిధి, ఓనర్షిప్ తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేయాలన్నారు. పాలకొల్లులో రెండు లక్షల మొక్కలను నాటి ప్రజల భాగస్వామ్యంతో రూ.రెండు కోట్ల వ్యయంతో ట్రీగార్డులను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే రామానాయుడు తెలియజేయగా మిగిలిన నియోజకవర్గాలలో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని, మంచి ఫలితాలు సాధించాలని కోరారు.
మేయర్ కోనేరు అవినీతిపై ఆధారాలు చూపిన వైకాపా
విజయవాడ, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): కృష్ణా పుష్కరాల నిధులను విజయవాడ నగర టిడిపి మేయర్ కోనేరు శ్రీధర్ దుర్వినియోగం చేశారని ఆరోపించిన వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వైకాపా అందుకు తగిన సాక్ష్యాధారాలను మంగళవారం మీడియాకు ప్రదర్శించింది. కేఎంకే అనే సంస్థకు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన పుష్కర పనులను మేయర్ శ్రీధర్ అప్పగించారని, ఆ సంస్థలో శ్రీధర్ భార్య రమాదేవి డైరెక్టర్‌గా ఉన్నారని గతంలోనే ఆరోపించిన వైకాపా ఆ బిల్లుపై రమాదేవి సంతకాలు చేసి ఉండడాన్ని మీడియాకు చూపారు. పురపాలక చట్టం ప్రకారం మేయర్ కుటుంబ సభ్యులెవ్వరు కాంట్రాక్టులు చేయరాదని స్పష్టంగా ఉంది. అయితే మేయర్ భార్య డైరెక్టర్‌గా ఉండడమే కాకుండా ఆ సంస్థే ఐదు కోట్ల రూపాయల పుష్కర పనులు చేయడం చట్టవ్యతిరేకమని, శిక్షార్హమైన నేరమని అన్నారు. వెంటనే మేయర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ అనుమతిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. వైకాపా ఫ్లోర్‌లీడర్ జమునరాణితో పాటు పలువురు కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు.


