జుట్టు కత్తిరించుకున్న టెన్నిస్ క్రీడాకారిణి
సింగపూర్, అక్టోబర్ 25: మైదానంలో ఆడుతున్నప్పుడు పలువురు క్రీడాకారుల కళ్లకు జట్టు అడ్డుపడుతుంటుంది. ముఖ్యంగా మహిళా ప్లేయర్లకు ఆ ఇబ్బంది ఎక్కువగా తలెత్తుతుంది. టెన్నిస్లో అయితే షాట్లు కొట్టిన ప్రతిసారీ నుదిటి మీద నుంచి జుట్టు మాటిమాటికి కళ్లకు అడ్డుపడుతుంటుంది. అందుకే ఎక్కువశాతం తక్కువ జుట్టు ఉంచుకోవడం, ముడి వేసుకోవడం చేస్తుంటారు. అలా కూడా సాధ్యం కాకపోతే ఏం చేస్తారు? జుట్టును కత్తిరించి పక్కన పడేయడమే!
రష్యాకు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ కుజ్నెట్సోవా మ్యాచ్ జరుగుతుండగా కోర్టులోనే జట్టు కత్తిరించి పక్కన పెట్టింది. సింగపూర్లో జరిగిన ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలాండ్ దేశానికి చెందిన రద్వాన్స్కాను 7-5, 1-6, 7-5 తేడాతో ఈ మ్యాచ్లో ఓడించింది కుజ్నెట్సోవా. అయితే మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి ఆమె వివరణనిచ్చింది. తాను షాట్ కొడుతున్న ప్రతిసారి జుట్టు తన కంటికి తగిలి ఇబ్బందిపెడుతుందని మ్యాచ్ గెలిచే క్రమంలో తప్పక జుట్టును కత్తిరించాల్సి వచ్చిందని తెలిపింది. గతంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఆండీ ముర్రే, జర్మన్ ప్లేయర్ బోరిస్ బెకర్లు కూడా ఇలానే కోర్టులోనే తమ జుట్టును కత్తిరించుకున్నారు.
థీమ్ పార్కులో ప్రమాదం: నలుగురి మృతి
సిడ్నీ, అక్టోబర్ 25: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద థీమ్ పార్కులోని వాటర్ రెయిడ్లో ప్రమాదం సంభవించి, నలుగురు మరణించారు. క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని గోల్డ్ కోస్ట్ టూరిస్ట్ జిల్లాలోని డ్రీమ్వరల్డ్ థీమ్ పార్కులో ఈ ప్రమాదం జరిగింది. థండర్ రాపిడ్స్ రివర్ రెయిడ్ అనే నీటి రెయిడ్లో అందరూ ఉండగా ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రమాదం జరగడంతో అక్కడున్నవాళ్లంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రెయిడ్లో కన్వేయర్ బెల్టు, ఆరుగురు వ్యక్తులు ఒకేసారి కూర్చోగల సర్క్యులర్ రాఫ్టులు ఉపయోగిస్తారు. అయితే కన్వేయర్ బెల్టు తెగిందా? లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మిగిలిన వివరాలను మీడియా సమావేశంలో తెలియజేస్తామని పోలీసులు అన్నారు. ఇరాక్ భద్రతా దళాలు 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గత మూడు రోజులుగా కిర్కుక్ నగరంలో భద్రతా దళాలకు, జిహాదీలకు మధ్య జరిగిన కాల్పులు ముగిశాయి. ఈ కాల్పుల్లో 74 మంది జిహాదీలు మరణించినట్లు ప్రొవిన్షియల్ గవర్నర్ నజుముద్దీన్ కరీం తెలిపారు. శుక్రవారం సుమారు వంద మంది ఉగ్రవాదులు నగరంపై దాడులు ప్రారంభించారని అందులో కొంత మంది స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ఉగ్రదాడుల్లో సుమారు 46 మంది ప్రజలు మరణించారని అందులో ఎక్కువగా భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దాడులు ముగిశాయని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆయన వివరించారు. యుద్ధ రంగం నుంచి పిరికిపందల్లా పారిపోయేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఏడుగురికి ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మరణదండన విధించింది. తమ కీలక స్థావరం నుంచి మోసూల్ నగరం నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించినందుకు వీరికి మరణశిక్ష అమలుచేసినట్టు స్థానిక వెబ్ సైట్ అరా న్యూస్ వెల్లడించింది. ఈ ఏడుగురు సిరియా సరిహద్దులో ఆదివారం పట్టుబడ్డారు. అధినాయకత్వం అనుమతి లేకుండా తమ పదవులను వదిలిపెట్టారు. మొసూల్ నగరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. జాతిద్రోహానికి పాల్పడినందుకు వీరిని కాల్చిచంపారని మీడియా కార్యకర్త అబ్దుల్లా ఆల్-మల్లా వెల్లంచినట్టు అరా న్యూస్ తెలిపింది. మోసుల్ నగరాన్ని దక్కించుకునేందుకు అమెరికా సైనం సహకారంలో ఇరాక్ ఆపరేషన్ మొదలుపెట్టడంతో ఐసిస్ తీవ్రంగా పోరాడుతోంది. మోసుల్ నగరాన్ని 2014లో ఐసిస్ స్వాధీనం చేసుకుని తమ రాజధానిగా ప్రకటించుకుంది.
తోటి పెళ్లికూతుళ్లపై లైంగిక దాడులు?
బీజింగ్, అక్టోబర్ 25: చైనాలో రోజు రోజుకూ తోటి పెళ్లికూతుళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు మిత్రులు వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారు. గత నెలలోనే పెళ్లికూతురు తరఫున 28 ఏళ్ల తోటి పెళ్లికూతురికి పీకలదాకా మద్యం తాగించడం వల్ల అమె మరణించింది. ఈ సంఘటన కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఓ ఆచారంగా వస్తున్న తోటి పెళ్లికూతుళ్ల తతంగం మొదటిసారి కలవరం రేపింది. ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి తోటి పెళ్లికూతురుగా వచ్చిన లియూ యాన్ అనే సినీ నటిని పెళ్లికొడుకు మిత్రులు అమాంతంగా ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేసి అల్లరి చేయడం చైనా ఇంటర్నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. చైనాలో ఈ తోటి పెళ్లకూతుళ్ల సంప్రదాయం గణవ్యవస్థ కాలం నుంచి కొనసాగుతోంది. అప్పట్లో ఓ గణంలోని అమ్మాయికి పెళ్లంటే ఆ అమ్మాయిని ఇప్పటిలాగే ఉన్నంతలో ఖరీదైన ఆభరణాలు, దుస్తులతో అందంగా అలంకరించేవారట. శత్రుగణాలు నగల కోసం పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయేవట. అలా జరగకుండా పెళ్లికూతుళ్లను కాపాడుకోవడం కోసం తోటి పెళ్లికూతుళ్ల తతంగం వచ్చిందని పెద్దలు చెబుతారు. వారు కూడా అచ్చంగా పెళ్లి కూతుళ్లలాగే తయారై ఇళ్లంతా సందడి చేసేవారు. ఇంటికొచ్చిన ప్రతి అతిథిని పెళ్లికూతురు పలకరించడం, మర్యాదపూర్వకంగా వారితో కలసి బియ్యంతో తయారుచేసిన వైన్ తాగడం ఆనవాయితీ. ఇందులో కూడా పెళ్లి కూతురుకు రిస్క్ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని కూడా తోటి పెళ్లికూతురుతోనే చేయిస్తూ వస్తున్నారు. పెళ్లి పీటల మీదకు ఎక్కే ముందు మాత్రమే పెళ్లి కూతురు బంధు, మిత్రుల మధ్యకు వస్తుంది. ఇలా చేయడం ద్వారా నాడు గణ వ్యవస్థలో పెళ్లికూతుళ్లను రక్షించుకోగలిగారని ఆచార, వ్యవహారాలు తెలిసిన చైనా పెద్దలు చెబుతున్నారు. పెళ్లి కూతురనుకొని తోటి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిన గణాలు కూడా ఆమె ధరించిన నగలన్నీ నకిలీవని తెలిసి వదిలేసే వారట. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారంలో చాలాకాలం వరకు పెళ్లి కూతురు బంధువులు లేదా మిత్రులే తోటి పెళ్లి కూతురుగా వ్యవహరించేవారు. ఇంటికొచ్చిన అతిథులను ఆహ్వానించడం, పెళ్లి కొడుకు పరివారాన్ని ఎదుర్కోవడం, పెళ్లి తర్వాత కొత్త దంపతుల మూడు రాత్రుల ముచ్చట తీర్చేవరకు అన్ని పెళ్లి తతంగాల్లో తోటి పెళ్లి కూతురుదే ముఖ్యపాత్ర. ఒకప్పుడు మూడు రాత్రుల ముచ్చట ఎలా తీర్చుకోవాలో కూడా అనుభవంలేని పెళ్లి కొడుకులకు తోటి పెళ్లి కూతుళ్లే శిక్షణ ఇచ్చేవారట. సమాజం మారుతున్నకొద్దీ చైనాతోపాటు భారత్ లాంటి ఆసియా దేశాల్లో తోటి పెళ్లి కూతుళ్ల తతంగం మారుతూ వచ్చి నిన్నటివరకు సింబాలిక్గానే మిగిలిపోయింది. పెళ్లిళ్లు అట్టహాసంగా, ఆర్భాటంగా చేసుకోవడంలో భాగంగా ‘వెడ్డింగ్ ప్లానర్లు’ వచ్చిన విషయం తెల్సిందే. ఈ వెడ్డింగ్ ప్లానర్లు పేరుకు మాత్రమే మిగిలిపోయిన తోటి పెళ్లికూతుళ్ల తతంగానికి మళ్లీ వన్నె తెచ్చారు. ఇప్పుడు దీన్ని ఓ వృత్తిగా స్వీకరిస్తూ సెలబ్రటీలుగా వెలుగుతున్న వాళ్లు పలు దేశాల్లో ఉన్నారు. తాము ప్రతి పెళ్లికి తోటి పెళ్లి కూతురును ఏర్పాటు చేస్తున్నామని, వారి అందం, మాటతీరు, కలుపుగోలుతనం తదితరాలను బట్టి రోజుకు ఒక్కో తోటి పెళ్లి కూతురుకు 2,200 రూపాయల నుంచి 9,000 రూపాయలను చెల్లిస్తున్నామని చైనాలోని దాదాపు 50 వెడ్డింగ్ ప్లానర్లు తెలియజేశారు. కొన్ని పెళ్లిళ్లకు ఇద్దరు, ముగ్గురు తోటి పెళ్లికూతుళ్లు కావాలని కూడా కోరుతున్నారని, వారాంతంలోనే ఎక్కువ పెళ్లిళ్లు ఉంటాయి కనుక మిగతా రోజుల్లో మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ వారంతంలో తోటి పెళ్లికూతుళ్ల అవతారం ఎత్తేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నారని వారు చెప్పారు. ఒకప్పుడు పెళ్లి కూతురు, ఇప్పుడు ఆమె తరఫున తోటి పెళ్లి కూతురు బంధు, మిత్రులతో మద్యం సేవించడం సంప్రదాయం కనుక అప్పుడప్పుడు అసభ్య, అఘాయిత్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చట్టాలు తీసుకొస్తే మంచిదేమోనని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు బౌన్సర్లను ఏర్పాటు చేస్తే మంచిదేమో!? ఇదిలావుండగా, ఆస్ట్రేలియాకు చెందిన 70 ఏళ్ల వ్యక్తికి ఇండోనేషియా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలీ దీవిలోని ఓ రిసార్ట్లో పలువురు యువతులపై అతడు లైంగిక దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అతడు పదిహేనేళ్లు కారాగారంలో గడపాలని ఆదేశించింది. రాబర్ట్ ఆండ్రూ ఫిడెస్ ఎల్లిస్ అనే వ్యక్తి మొత్తం 11 మంది యువతులపై 2014, 2015 సంవత్సరాల మధ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత అతడు నిజంగానే ఆ నేరానికి పాల్పడ్డాడని నిర్దారణకు వచ్చిన అక్కడి జిల్లా కోర్టు ఒకటి ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రెండు బిలియన్ల జరిమానా అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్షను విధించింది. అయితే, కోర్టు తీర్పుతో విభేదించిన న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో తిరగి అపీల్ చేయనున్నారు.


