జూనియర్‌ను ఫాలో అవుతున్న అల్లు!
సరైనోడు సూపర్ సక్సస్స్ తరువాత అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న దువ్వాడ జగన్నాధం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటపడింది. గతంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలోని చారి పాత్రను పోలిన విధంగా అల్లు అర్జున్ హరీష్ శంకర్ సినిమాలో ఒక బ్రాహ్మణ పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్. బన్నీ తన కెరియర్లో ఇప్పటి వరకు ఎప్పుడు బ్రాహ్మణ పాత్రలు చేయని నేపధ్యంలో వెరైటీగా ఉంటుందని హరీష్ శంకర్ ఈ పాత్రను ఇలా డిజైన్ చేసినట్లు టాక్. పూర్తిగా కామెడీ టచ్‌గా ఈ పాత్ర ఉండబోతోంది అని తెలుస్తోంది.
హరీష్ శంకర్ ఈ పాత్రను ఇలా డిజైన్ చేయడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన అదుర్స్ సినిమాలోని చారి పాత్రకు సంబంధించిన కామెడీ సీన్స్ అన్నీ హరీష్ శంకర్ ఘోస్ట్ రైటర్‌గా ఆరోజులలో అదుర్స్ సినిమా కోసం క్రియేట్ చేసినట్లు టాక్. అంతేకాదు హరీష్ శంకర్ వినాయక్ వద్ద సహాయకుడిగా అదుర్స్ సినిమాకు పనిచేయడమే కాకుండా ఆ సినిమా స్క్రిప్ట్ రచనలో తన సహకారాన్ని పూర్తిగా అందించినట్లు తెలుస్తోంది. అదుర్స్ సినిమా ఘన విజయంలో ఆ సినిమా చారి పాత్ర కామెడీ ట్రాక్ కీలకపాత్ర వహించడంతో తిరిగి అదే సెంటిమెంట్‌తో హరీష్ శంకర్ తన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధంలో ఈచారి పాత్ర ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి.
గబ్బర్ సింగ్ ఘన విజయం తరువాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన హరీష్ శంకర్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లిస్టులో తన స్థానాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీనితో అతికష్టంపై అల్లు అర్జున్ను తన కథకు ఒప్పించిన హరీష్ శంకర్ ఈ దువ్వాడ జగన్నాధం సూపర్ సక్సస్ కోసం తన చారి పాత్రను తిరిగి ప్రేక్షకులపై ప్రయోగిస్తున్నాడు అనుకోవాలి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో తిరిగి కాజల్ హీరోయిన్గా ఎంపిక కావడం షాకింగ్ న్యూస్‌గా మారింది. దీనిని బట్టి చూస్తూ ఉంటే బన్నీ లాంటి హీరోలకు కూడా హీరోయిన్స్ సమస్య ఎంతగా ఉందో అర్ధం అవుతోంది. అల్లు అర్జున్‌కు అన్ని విధాల కలిసి వచ్చే సమ్మర్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే సమ్మర్‌కు విడుదల చేయాలని ప్రయత్నిస్తున్న ఈ సినిమాకు ఈ చారి పాత్ర సెంటిమెంట్ ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.


