జెట్ ఎయిర్వేస్, ఎతిహాద్ ఒప్పందం
జెట్ ఎయిర్వేస్, ఎతిహాద్ ఎయిర్వేస్ ఒప్పందం ఎట్టకేలకు పూర్తయింది. జెట్ ఎయిర్‌వేస్‌లోని 24 శాతం వాటాలను 2,069 కోట్ల రూపాయలకు అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఎతిహాద్ ఎయిర్వేస్కు విక్రయించడానికి కుదిరిన ఒప్పందం పూర్తి అయినట్లు ఆ రెండు విమానయాన సంస్థలు బుధవారం ప్రకటించాయి. నియంత్రణ సంబంధిత అనుమతులన్నింటినీ ఈ నెల 12న పొందినట్లు వెల్లడించాయి.
విదేశీ ఎయిర్‌లైన్స్‌కు వాటాలను విక్రయిస్తున్న తొలి సంస్థ జెట్ కావడం గమనార్హం. ఒప్పందంలో భాగంగా రూ. 10 ముఖ విలువతో కూడిన ఒక్కొక్క షేరును రూ. 754.73 ధర చొప్పున 2,72,63,372, ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఎతిహాద్‌కు ఎయిర్వేస్కు కేటాయించింది. దీంతో ఎతిహాద్‌కు ఇక జెట్ చెల్లించిన మూలధనంలో 24శాతం వాటా దక్కినట్లయింది. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా జెట్ ఎయిర్వేస్లో 51 శాతం వాటా జెట్ ఛైర్మన్, ప్రమోటర్ నరేష్ గోయల్ వద్దే ఉంటుంది. ఎతిహాద్ ప్రెసిడెంట్, సిఈఓ జేమ్స్ హోగన్‌ను, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసరును జెట్ డైరెక్టర్ల బోర్డులో అదనపు డైరెక్టర్లుగా నియమించినట్లు కూడా ఈ రెండు కంపెనీలు తెలిపాయి.


