జేఎన్టీయూకే పరిధి కళాశాలలకు బయోమెట్రిక్ అమలు
కాకినాడ: విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఉపకులపతి విఎస్ఎస్.కుమార్ సూచించారు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు వేసేటప్పుడు అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టేందుకు ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయడం జరుగుతుందని, అలాగే జియోట్యాగింగ్ పద్ధతిని కూడా అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ విధానం అంశంపై అనుబంధ కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపాల్స్ , యూనివర్శిటీ కాలేజ్ ప్రిన్సిపాల్స్‌తో అవగాహన సదస్సు నిర్వహించారు. జెఎన్టియుకె అలూమ్నీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపకులపతి విఎస్ఎస్.కుమార్ విచ్చేశారు.
ముందుగా ఓఎస్డి కె.వి.రమణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో విసి కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసి)కు అనుసంధానమయ్యే పద్ధతి, అలాగే ఆధార్ కార్డులో ఉన్న చివరి ఎనిమిది నెంబర్లతో అనుసంధానం కావడం మొదలగు వాటిపై సూచనలు చేశారు. రిజిస్ట్రార్ సిహెచ్.సాయిబాబు మాట్లాడుతూ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న హార్డ్‌వేర్ ద్వారానే బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలన్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రత్యేక ఐడిలను కేటాయించాలని, జియోట్యాగింగ్‌ను సమన్వయపర్చుకోవాలని, ఈపాస్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌కు, సీఎం డ్యాష్‌బోర్డ్‌కు, జెఎన్టియుకె పోర్టల్‌కు అనుసంధానం చేయాలని తెలియజేశారు.
బయోమెట్రిక్ గురించి అన్ని వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు. అనంతరం జెవిఆర్ మూర్తి, డాక్టర్ ఎఎస్ఎన్.చక్రవర్తిలు కళాశాలల యాజమాన్యాలు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. బయోమెట్రిక్ అమలులో ఇంటర్నెట్ సౌకర్యం చాలా అత్యవసరమని, ప్రతీ 80మందికి ఒక బయోమెట్రిక్ పరికరాన్ని వినియోగించాలని, పరికరాల డిజైన్లు, తక్కువ ఖర్చుతోనే పరికరాలను కొనుగోలు చేయాలని, వైఫై సౌకర్యం అత్యవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ సిహెచ్ సాయిబాబు, ఓఎస్డి కె.వి.రమణ, డిఇపి.సుబ్బారావు, డైరెక్టర్లు, ప్రోగ్రాం డైరెక్టర్లు, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, టీచింగ్ సిబ్బంది, యుసిఇకె, అనుబంధ కళాశాలల యాజమాన్యం, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.


