జేఎస్ఎస్కే పటిష్టమంతంగా అమలు: కలెక్టర్ వెల్లడి
కాకినాడ, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లాలో జననీ శిశు సంరక్షణా కార్యక్రమం (జె.ఎస్.ఎస్.కె.) సక్రమంగా అమలు చేయాలని, ఈ పధకం కింద కేటాయించిన నిధుల వినియోగంతో ఆసుపత్రి ప్రసవాలు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారంనాడు తన క్యాంపు కార్యాలయంలో ఆయన జిల్లాలోని వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పధకం ద్వారా ఆసుపత్రులలో సాధారణ కాన్పులకు రూ.1000/-, సిజేరియన్ కేసులకు రూ.1600/- చెల్లించే అవకాశం ఉందని, అదే విధంగా తల్లీ బిడ్డలను ఇంటికి రవాణా సౌకర్యం కల్పిస్తారన్నారు.
ఈ పధకం కింద జిల్లాకు కేటాయించిన 1.90 కోట్ల నిధులలో రూ. 50 లక్షలు పిహెచ్సీలకు విడుదల చేసారన్నారు. అదే విధంగా 25 లక్షలు ఏజెన్సీలోని ఐటిడిఏకు విడుదల చేసారన్నారు. ఈ పధకం కింద అందించే అహారం నాణ్యత కలిగి ఉండాలని, జిల్లాలోని సిహెచ్‌సిలలో కూడా ఆహార పంపిణీకు కాంట్రాక్టర్లను గుర్తించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతానికి జిల్లా ప్రోజెక్ట్ అధికారి ఖాళీ భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ పధకం కింద ఏజెన్సీలోని 28 పిహెచ్‌సీలలో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలోని వైద్యుల ఖాళీలపై కలెక్టర్ మాట్లాడుతూ వైద్యుల ఎంపిక సమయంలో రూపొందించిన ప్యానల్ ఆధారంగా ఖాళీ వచ్చిన వెంటనే వైద్యులను నియమించే ప్రక్రియ కొనసాగాలన్నారు. జిల్లాలోని కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యులు పని చేస్తున్న పిహెచ్‌సీలలో నిధుల వినియోగం ద్వారా సదుపాయాల కల్పనలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి అనుభవం గల కాంట్రాక్ట్ వైద్యులకు కూడా డ్రాయింగ్ పవర్స్ ఇవ్వాలని కలెక్టర్ డిఎంహెచ్ఓకు సూచించారు. దీని ద్వారా ఆసుపత్రి అభివృధ్ధి నిధుల వినియోగం ద్వారా వైద్య సదుపాయాలు మెరుగుపడతాయన్నారు.
జిల్లాలో ఉన్న 23 సిహెచ్సీల పనితీరును సమీక్షించిన కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ప్రోత్సహించాలని, జిల్లాలో 53 శాతం ప్రసవాలు ప్రయివేటు ఆసుపత్రులలో జరుగుతున్నాయని అన్నారు. ఆసుపత్రుల అభివృధ్ధికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని, మండపేట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పనితీరును కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులలో పారిశుధ్యం మెరుగుదలకు సంబంధిత పురపాలక సంఘాల సహకారం తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం, చింతూరు ఆసుపత్రులలో గైనికాలజిస్టులను డిప్యూటేషన్‌పై నియమించాలని కలెక్టర్ సూచించారు.
ఏజెన్సీలో దోమతెరల పంపిణీకి చర్యలు చేపట్టాలని కూడా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ కె.చంద్రయ్య, జిల్లా ప్రోజెక్ట్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.సత్యన్నారాయణ, పిఐఓ డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.


