జ్యూట్ వ్యాపారంతో నారీమణుల జీవితాల్లో వెలుగు కిరణాలు
ఏలూరు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): అక్షరా జ్ఞానం కూడా లేని నారీమణులు పల్లె ప్రాంతంలో తప్ప పట్టణ ప్రాంతాలు ఎలా ఉంటాయో కూడా తెలియని స్ధితిలో రాష్ట్రాలు దాటి వ్యాపార రంగంలో మెళుకువులు తెలుసుకుని రాణించగలిగే స్ధాయికి భీమఢోలు మండలం కూరెళ్లగూడెం మహిళలు చేరుకున్నారు. వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ కుటుంబానికి ఆర్ధికంగా కొంత ఆసరాగా నిలుస్తున్న స్ధితిలో ప్రభుత్వం పిలుపుమేరకు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేరిన 100 మంది మహిళలు ఆర్ధిక పురోభివృద్ధి సాధిస్తున్నారు. చదువుకోలేకపోయినా వ్యాపారవేత్తలుగా తాము ఎ వరికీ తీసిపోమని 11 మంది మహిళలు నిరూపించారు.
భుజానికి బ్యాగ్ తగిలించుకుని హడావుడిగా వెళుతున్న జ్యోతికి ఎదురొచ్చింది స్నేహితురాలు లక్ష్మి. ఎక్కడికి వెళుతున్నావని జ్యోతిని అడిగింది లక్ష్మి. చేతి సంచులకు ముడి సరుకు వచ్చింది దానిని గోడౌన్లలో దించుకోవడానికి వెళుతున్నానని హడావుడిగా చెప్పింది. చేతి సంచులేంటి, ముడి సరుకులేంటి అని అడిగింది లక్ష్మీ? నేను ఈ మధ్యనే జ్యూట్‌తో చేతి సంచులు చేసి అమ్మే వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ. 5,000/-లకు పైగా సంపాదించుకుంటున్నాను. అని జ్యోతి తన స్నేహితురాలు లక్ష్మికి గర్వంగా చెప్పింది.
ఇక జ్యోతి విజయగాధ తెలుసుకుందాం… జ్యోతి, జాన్సీ లక్ష్మీబాయ్, క్రాంతి, అంబేద్కర్ మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన 11 మంది మహిళలు తాము వ్యాపారవేత్తలు కావాలనే సంకల్పంతో జీవనజ్యోతి జ్యూట్ బ్యాగ్ ల వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుండి రెండు నెలల క్రితం రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని పొంది చెన్నై, హైదరాబాద్ నగరాలలో లభించే జ్యూట్ ఉత్పత్తుల ముడి సరుకులు కొనుగోలు చేసారు. చేతిసంచులు, స్కూలు బ్యాగ్ లు, మహిళల హ్యండ్ బ్యాగ్ ల తయారీ యూనిట్ ప్రారంభించారు.
ఒకప్రక్క వ్యవసాయ పనులు ఉన్నరోజుల్లో కూలికి వెళుతూ పనులు లేని కాలంలో చేతిబ్యాగ్ ల తయారీపై దృష్టి పెట్టి ఆర్ధికంగా అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నారు. ఏడు ఆధునిక కుట్టుమిషన్లను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల నుండి జ్యూట్ ఉత్పత్తుల షీట్లను దిగుమతి చేసుకుని డిమాండ్‌కు అనుగుణంగా చేతిసంచుల తయారీని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల వాడకాన్ని విడనాడాలన్న స్పూర్తితో ప్రజలకు జ్యూట్ సంచులు తక్కువ ధరకే అందుబాటులో తీసుకురావడానికి ఈ మహిళలు చేస్తున్న ప్రయత్నం ఫలప్రదం కావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
దళిత వర్గాలకు చెందిన బొర్రా ప్రవిూలారాణి, బొబ్బిలి కమల, దాసరి నాగమణి చేతి సంచుల తయారీలో శిక్షణ పొంది నూతన పద్ధతిల్లో ఉత్పత్తులు అందరికి అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్ ప్రోత్సాహంతో ఈ యూనిట్‌ను ప్రారంభించామని దాసరి నాగమణి చెప్పింది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు, తదితరులు తమ యూనిట్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసారని అందరి ఆశలకు అనుగుణంగా తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని నాగమణి వివరించింది.
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకుని జ్యూట్ ఉత్పత్తులతో చేతి సంచులను ప్రత్యేక స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా కోరిన డిజైన్‌లో సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలంతా ఐకమత్యంతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి తమ వ్యాపారమే ఒక నిదర్శనమని జీవనజ్యోతి జ్యూట్ ఉత్పత్తుల తయారీ మహిళలు ఆత్మస్ధైర్యంతో చెప్పారు.


