టీడీపీ ఊబిలాంటది
- 40 Views
- admin
- February 25, 2023
- రాష్ట్రీయం
టీడీపీ ఊబిలాంటిదని… ఆ పార్టీని రక్షించేందుకు ఎవరు వెళ్లినా కూరుకుపోవడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ విశ్వసనీయత లేని వ్యక్తి అని… అందుకే మంగళగిరిలో బ్రహ్మణి ప్రచారం చేసినా లోకేశ్ ఓడిపోయారని కొడాలి నాని అన్నారు. అక్కడ బ్రహ్మణి పోటీ చేసి ఉంటే గెలిచే వారని చెప్పారు. మంగళగిరిలోనే పార్టీని గెలిపించలేని వాళ్లు… రాష్ట్రంలో ఆ పార్టీని ఎలా నడిపించగలరని ప్రశ్నించారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని, ఆ తర్వాత అవమానించారని… చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని… అభివృద్ధి కోరుకునే వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాల్సిందేనని టీడీపీ యువనేత నారా లోకేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేశ్ ఆహ్వానించడమేమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీనీ స్థాపించిందే జూనియర్ ఎన్టీఆర్ తాత అని చెప్పారు. టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేకే పార్టీలోకి తారక్‌ను రమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తే టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని అన్నారు.


