ట్రంప్‌కు భారత్‌లో భారీ ఆస్తులు!
- 61 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తులు ప్రపంచ వ్యాప్తంగా భారీగానే ఉన్నాయట. తాజా లెక్కల ప్రకారం ఆయనకు ఒక్క భారత్‌లోనే వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు మార్కెట్ లెక్కల అంచనా. మరోవైపు, డొనాల్డ్ జె ట్రంప్ సంస్థ భారత్‌లో విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. తమ వ్యాపార విస్తరణకు భారత్ అనువైన దేశమని గుర్తించిన ట్రంప్ సంస్థ ఆ దిశగా ఇక్కడ కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఈ సంస్థ దేశంలో ఐదు భారీ ప్రాజెక్టులను మొదలుపెట్టింది.
ఈ విషయం ట్రంప్ సంస్థ అధికారికంగా కూడా వెల్లడించింది. సమీపంలోని ఉత్తర అమెరికా దేశాల్లో కూడా ట్రంప్ సంస్థ ఇన్ని ప్రాజెక్టులు ప్రారంభించలేదట. భారత్‌లో ప్రారంభించిన ఐదు ప్రాజెక్టుల విలువ సుమారు పది వేల కోట్ల రూపాయల పైమాటేనట. ట్రంప్ సంస్థ కేవలం బ్రాండ్ లైసెన్స్-లు మాత్రమే జారీ చేస్తుంది. నయాపైసా పెట్టుబడి పెట్టదు కూడానూ. భారత్‌లో విలాసవంతమైన భవనాలకు ట్రంప్ పేరు జతచేయడంతో వాటి విలువ పెరుగుతుందని ఆయన సంస్థ బ్రాండ్ నేమ్ వినియోగించుకునేవారు భావిస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటూ ట్రంప్ ఆర్గనైజేషన్ పైసా పెట్టుబడి లేకుండా భారత్ నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
ఈ ట్రంప్ టవర్స్-లో అపార్ట్మెంట్ల ధర కూడా ఆకాశాన్నంటుతోంది. ముంబయిలో అపార్ట్మెంట్ ధర దాదాపు రూ.9 కోట్లు కాగా, పుణెలో 6,100 చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ.13 కోట్లు. ఇక దేశరాజధాని ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన హరియాణాలోని గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్-టెన్షన్ రోడ్డులో నిర్మిస్తున్న రిటైల్ కాంప్లెక్స్ విలువ రూ.1,000 కోట్లట. ట్రంప్ సంస్థ గురుగ్రామ్‌తో మరో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కోల్‌కతాలో 38 అంతస్తుల భవన నిర్మాణం ప్రస్తుతం ప్రారంభదశలో ఉంది. ఇలా ట్రంప్ వ్యాపార విస్తరణకు భారత్‌ను కేంద్ర బిందువుగా వాడుకుంటున్నారన్నమాట.


